
ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మనకు అందుబాటులో ఉండే ఆకుకూరల్లో పొన్నగంటి కూరకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో దీనిని ఒక దివ్యౌషధంగా ఉపయోగిస్తున్నారు. పొన్నగంటి ఆకుకూరను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా.. ఈ కూర రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తుందని చెబుతున్నారు.
పోషకాల గని పొన్నగంటి ఆకు..
పొన్నగంటి కూరలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. బీటా కారోటిన్, ఐరన్, ఫైబర్ (పీచు పదార్థం), క్యాల్షియం, విటమిన్ ఎ, బి, సి, ఫోలేట్, రైబోఫ్లేవిన్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్లు వంటివి ఇందులో సమృద్ధిగా లభిస్తాయి.. అందుకే.. దీనిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు:
రక్తహీనతకు చెక్ (అనీమియా):
పొన్నగంటి కూరలో ఐరన్, పోషకాలు అధికంగా ఉండటం వల్ల ఇది రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా శరీరంలో రక్తం బాగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు ఈ ఆకుకూరను రోజూ తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు.
కంటి చూపు మెరుగుదలకు:
ఇందులో విటమిన్ ‘ఎ’ అధికంగా ఉండటం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి. ప్రతి రోజూ కంప్యూటర్ల ముందు పనిచేసేవారికి, కంటి చూపు మందగించిన వారికి పొన్నగంటి ఆకు ఎంతో మేలు చేస్తుంది.
బరువు తగ్గేందుకు సహాయం:
అధిక బరువుతో బాధపడేవారు రోజూ పొన్నగంటి కూరను తమ ఆహారంలో తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరిగి సులభంగా బరువు తగ్గుతారు.
గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రణ:
ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి తోడ్పడుతుంది. దీనివల్ల గుండెపోటు (హార్ట్ ఎటాక్) వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
చర్మం – జుట్టు సంరక్షణ:
పొన్నగంటి కూర తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడి, చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇందులో ఉండే ‘బయోటిన్’ జుట్టుకు పోషణనందించి, జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది.
మధుమేహం (షుగర్), క్యాన్సర్ నిరోధకం:
పొన్నగంటి ఆకుకూర రక్తంలో చక్కెర స్థాయిలను (Sugar levels) అదుపులో ఉంచుతుంది. ఇది క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా కాపాడుతుందని పేర్కొంటున్నారు.
పురుషుల ఆరోగ్య సమస్యలు:
పొన్నగంటి ఆకును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పురుషులలో వీర్య కణాల సంఖ్య, నాణ్యత పెరుగుతాయని, సంతానలేమి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంటున్నారు.
పైల్స్ నుంచి ఉపశమనం:
పొన్నగంటి ఆకును నెయ్యితో కలిపి వండుకుని క్రమం తప్పకుండా తింటే పైల్స్ లేదా మూలశంక సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
అందుకే.. అతి తక్కువ ఖర్చుతో, సులభంగా దొరికే పొన్నగంటి కూరను మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే.. ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..