
ఆరో రోజు ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో ఉదయం నుంచే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఈరోజు దాదాపు లక్షన్నరకు పైగా భక్తులు గణనాథుడిని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా.
ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహా గణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనమిస్తున్నారు.బడా గణేష్‌తో పాటు కాళికామాత, సోమనాథ్ జ్యోతిర్లింగం, విశ్వకర్మ, విష్ణుమూర్తి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
భక్తుల కోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నలువైపులా క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది.
వీకెండ్ కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సమయం గడిచేకొద్దీ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా అధికారులు అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు.