
పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ ఏర్పడ్డాక పదేండ్ల బీఆర్ఎస్పాలనలో కేసీఆర్ కుటుంబం ధరణి ముసుగులో వేల కోట్ల విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించిందని సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్దీపక్జాన్, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీశ్ఆరోపించారు. డీసీసీ ఆఫీస్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులతో పూర్తిస్థాయిలో సర్వే చేయించి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. తర్వాత వాటిని పేద దళితులకు పంపిణీ చేయాలన్నారు.
బీఆర్ఎస్హయాంలో ధరణి పోర్టల్ నుంచి అనుభవదారుల కాలంను తొలగించి ఎస్సీ, ఎస్టీలను వారి భూములకు దూరం చేశారని మండిపడ్డారు. లక్షలాది మంది ప్రజల భూములు, ఇండ్లను 22ఏ జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ కుటుంబం తరతరాలకు సరిపడా ఆస్తులను కూడబెట్టుకుందని, దీనిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధులు, పార్టీ ఆఫీస్ బేరర్లు పాల్గొన్నారు.