Reading Time: < 1 minute

జూబ్లీహిల్స్‌లో ఫ్లోర్ క్లీనింగ్‌కు తాగునీళ్లు.. రూ.20 వేల ఫైన్ వేసిన జలమండలి

Caption of Image.

హైదరాబాద్: తాగునీటిని దుర్వినియోగం చేస్తున్న ఓ వినియోగదారుడిపై హైదరాబాద్ జలమండలి చర్యలు తీసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 23లో ఫ్లోర్ క్లీనింగ్ కోసం తాగునీటిని వినియోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. సంబంధిత వినియోగదారుడికి రూ.20 వేల జరిమానా విధించారు.పూర్ణిమ అనే వినియోగదారుడు తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించినట్లు జలమండలి అధికారులు తెలిపారు. దీంతో నిబంధనల ప్రకారం జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

తాగునీటిని బాధ్యతాయుతంగా వినియోగించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాగునీటిని రోడ్లు, ఫ్లోర్లు కడగడం వంటి ఇతర అవసరాలకు వినియోగిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో మంచినీటి లభ్యతపై ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. మరోవైపు తాగునీటిని అనవసర అవసరాలకు వినియోగించడంపై జలమండలి అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి తనిఖీలను మరింత ముమ్మరం చేయనుంది. ఎక్కడైనా తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తిస్తే నిబంధనల ప్రకారం జరిమానాలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు.ప్రజలు కూడా తాగునీటి దుర్వినియోగాన్ని గుర్తిస్తే జలమండలికి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇందుకోసం 99499 30003 వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

 

©️ VIL Media Pvt Ltd.