Reading Time: < 1 minute

దేశం కోసం ప్రాణాలర్పిస్తాం.. టెహ్రాన్‌‌లో లక్షలాది మంది ర్యాలీ

Caption of Image.
  •  అమెరికా, ఇజ్రాయెల్‌‌కు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజల నినాదాలు 
  • ఆయుధ శిక్షణకు 6 లక్షల మంది రెడీ 

టెహ్రాన్‌‌: అమెరికా, ఇజ్రాయెల్‌‌కు వ్యతిరేకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌‌లో శుక్రవారం లక్షలాది మంది ప్రజలు కదం తొక్కారు. ‘జన్‌‌ఫదే-ఇ-ఇరాన్ (ఇరాన్ కోసం ప్రాణత్యాగం చేసే యోధులు)’ పేరుతో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీలు రివల్యూషనరీ గార్డ్‌‌తోపాటు షియా మతపెద్దలు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆయుధాలు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. 

అమెరికా, ఇజ్రాయెల్ నాశనం కావాలంటూ నినాదాలు చేశారు. ర్యాలీకి ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియన్, సైనిక ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. దేశ రక్షణ కోసం అవసరమైతే ఆయుధాలు చేపట్టేందుకు సిద్ధమంటూ లక్షలాది మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. 

ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్‌‌ దాడులు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం నిర్వహించిన అతిపెద్ద ర్యాలీ ఇదేనని ‘ఏపీ’ వార్తాసంస్థ పేర్కొంది. ఈ కార్యక్రమంలో పరిమిత సైనిక శిక్షణ పొంది దేశ రక్షణలో భాగస్వాములయ్యేందుకు ప్రజలు పేర్లు నమోదు చేసుకున్నారు. మిలిటరీ దుస్తుల్లో జాతీయ జెండాలు పట్టుకుని టెహ్రాన్‌‌ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.

 6 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్‌‌ చేసుకున్నారని, 10 లక్షల మందికిపైగా శిక్షణలో పాల్గొనే అవకాశం ఉందని టెహ్రాన్‌‌ రివల్యూషనరీ గార్డ్‌‌ చీఫ్‌‌ జనరల్‌‌ హసన్‌‌ హసన్‌‌జాదే తెలిపారు. శుక్రవారం ర్యాలీలో 3 లక్షల మందికిపైగా పాల్గొన్నట్లు ప్రభుత్వ మీడియా సంస్థ అంచనా వేసింది. కొత్తగా శిక్షణ పొందేవారు దేశ రక్షణకు సిద్ధంగా ఉంటారని బసీజ్‌‌ అధిపతి హొస్సేన్‌‌ తాయెబ్‌‌ తెలిపారు. త్వరలో ఇతర నగరాల్లోనూ ఇలాంటి ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.  

మరో రెండు నౌకలపై దాడులు..

హార్మూజ్ జలసంధిలో శుక్రవారం తెల్లవారుజామున ఒక ఆయిల్ ట్యాంకర్‌‌పై మిస్సైల్‌‌ దాడి జరిగినట్లు బ్రిటిష్ నావికాదళ సంస్థ తెలిపింది. అంతకుముందు మరో నౌకపై కూడా దాడి జరిగినట్లు వెల్లడించింది. నిబంధనలకు విరుద్ధంగా జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన ‘ట్రెండ్‌‌’ ఆయిల్‌‌ ట్యాంకర్‌‌ను తామే లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ప్రకటించింది. 

మరోవైపు, ఇరాన్‌‌తో యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో అమెరికా జరిపిన రెండు వైమానిక దాడులను యుద్ధ నేరాలుగా పరిగణించేందుకు ఆధారాలు ఉన్నాయని ఐరాస  మానవ హక్కుల నిపుణుల కమిటీ గురువారం వెల్లడించింది.

©️ VIL Media Pvt Ltd.