
Oscar 2027 Indian Entry Gondhal: భారతీయ సినిమా నుంచి ఆస్కార్ బరిలో నిలిచే చిత్రంపై ఉత్కంఠకు తెరపడింది. 33 సినిమాలతో పోటీపడిన మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ ‘గోంధాల్’.. 99వ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారత్ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. మరి ఈ సినిమా ప్రత్యేకత ఏంటి? ఆస్కార్ రేసులో నిలిచిన నాలుగు తెలుగు చిత్రాలేవి? రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’కు ఎన్ని ఓట్లు వచ్చాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
భారత్ తరఫున ‘గోంధాల్’ ఎంపిక
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి అధికారికంగా ఏ సినిమా వెళ్తుందనే ఆసక్తికి సమాధానం దొరికింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం.. మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిన మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ ‘గోంధాల్’ (Gondhal)ను భారత అధికారిక ఎంట్రీగా ఎంపిక చేశారు.
సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరఫున పోటీపడనుంది. ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే ఉత్కంఠభరిత సంఘటనలు, ప్రేమ, నమ్మకద్రోహం, స్వేచ్ఛ కోసం చేసే ప్రయత్నాలు ఈ కథలో కీలకంగా ఉంటాయి. అయితే ‘గోంధాల్’ ఎంపిక వెనుక 33 సినిమాల పోటీ ఉంది. ఆ జాబితాలో తెలుగు, హిందీ, మరాఠీ సహా పలు భాషల చిత్రాలు చోటు దక్కించుకున్నాయి.
33 సినిమాల మధ్య గోంధాల్ ప్రయాణం..
ఆస్కార్ ఎంట్రీ కోసం మొత్తం 33 సినిమాలు పరిశీలనకు వచ్చాయి. ఇందులో హిందీ నుంచి 14 చిత్రాలు, మరాఠీ, తెలుగు, గుజరాతీ భాషల్లో నాలుగు చొప్పున సినిమాలు ఉన్నాయి. తమిళం నుంచి మూడు చిత్రాలు, మలయాళం, కొయాంక్ భాషల్లో ఒక్కో సినిమా పోటీపడ్డాయి. ఒక మూకీ చిత్రం కూడా ఈ జాబితాలో ఉంది. ఈ చిత్రాలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు ఫైనల్గా కొన్ని సినిమాలను షార్ట్‌లిస్ట్ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ‘గోంధాల్’, ‘అంఘ్’, ‘మై వాపస్ ఆవుంగా’ వంటి చిత్రాలు తుది పరిశీలనలో ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక చివరకు భారత అధికారిక ఎంట్రీగా ‘గోంధాల్’ను ఎంపిక చేసింది జ్యూరీ.
ఆస్కార్ రేసులో నాలుగు తెలుగు సినిమాలు..
ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నాలుగు సినిమాలు ఆస్కార్ పరిశీలనకు పంపిన చిత్రాల జాబితాలో ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాలతోపాటు ఇతర భాషా చిత్రాలు కూడా పోటీపడిన ఈ జాబితాలో తెలుగు సినిమాలకు చోటు దక్కడం ఆసక్తిని కలిగించింది.
FFI (Film Federation of India) ప్రకారం తెలుగు చిత్రాలు:
సింగీతం (Sing Geetham)
పెద్ది (Peddi)
ఇరుముడి (Irumudi)
ఎగ్వా (Egwa)
రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ‘పెద్ది’, మరోవైపు రవితేజ ‘ఇరుముడి’ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించింది. ‘సింగీతం’, ‘ఎగ్వా’ చిత్రాలు కూడా తెలుగు విభాగం నుంచి పరిశీలనకు వచ్చాయి. అయితే ఈ నాలుగు సినిమాల్లో ఏదీ భారత అధికారిక ఎంట్రీగా సెలెక్ట్ కాలేదు. అదేవిధంగా ‘హనుమాన్ అంశ్’, ‘బోర్డర్ 2’, ‘హక్’, ‘120 బహదూర్’, ‘ఇక్కిస్’, ‘ధురంధర్: ది రివెంజ్’ వంటి సినిమాలు కూడా పోటీలో నిలిచాయి. ఫైనల్గా.. మరాఠీ చిత్రం ‘గోంధాల్’ అవకాశం దక్కించుకుని టాక్ అఫ్ ది ఇండియాన్ సినిమాగా మారింది.
‘గోంధాల్’ కథేంటి?
స్వేచ్ఛ కోసం వేసిన అడుగు.. హత్యకు దారి!
ఆస్కార్ ఎంట్రీగా ఎంపికైన ‘గోంధాల్’ కథాంశం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యంలో ఒకే ఒక్క రాత్రిలో జరిగే సంఘటనల చుట్టూ సినిమా సాగుతుంది. మహారాష్ట్ర సంప్రదాయాల్లో భాగమైన ‘గోంధాల్’ అనే అర్థరాత్రి పూజా క్రతువు కథకు ప్రధాన నేపథ్యంగా ఉంటుంది. సంగీతం, నృత్యం, జానపద సంప్రదాయాలతో ముడిపడిన ఈ కళారూపం సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. సుమన్ (ఇషితా దేశ్‌ముఖ్)కు ధనవంతుడైన ఆనంద్ (యోగేష్ సోహోని)తో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లి తర్వాత ఆమె జీవితంలో అసంతృప్తి నెలకొంటుంది.
ALSO READ : రజనీతో తలపడే విలన్ ఇతడేనా?.
ఈ క్రమంలో సంప్రదాయ గోంధాల్ కళాకారుడైన సాహెబాతో ప్రేమలో పడుతుంది. తన వివాహ బంధం నుంచి బయటపడాలని భావించిన సుమన్.. స్వేచ్ఛ కోసం ఓ ప్రమాదకరమైన ప్రణాళిక వేస్తుంది. ఆ ప్లాన్‌లోకి ఆనంద్ బావమరిది సర్జేరావ్ (నిషాద్ భోయిర్)ను కూడా లాగుతుంది. కానీ స్వేచ్ఛ కోసం వేసిన ఆ అడుగు చివరకు ఓ హత్యకు దారితీస్తుంది. ఆ తర్వాత కథలో ప్రేమ, నమ్మకద్రోహం, స్వార్థం, ప్రాణభయం వంటి అంశాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఒకే రాత్రిలో చోటుచేసుకునే పరిణామాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటాయి.
అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు..
‘గోంధాల్’ దర్శకుడు సంతోష్ దావఖర్‌కు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2025లో జరిగిన 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఆయనకు ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ పీకాక్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘గోంధాల్’పై జ్యూరీ దృష్టి పడినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, కథనంలోని ప్రత్యేకత వంటి అంశాలు సినిమా ఎంపికలో ప్రాధాన్యం సంతరించుకున్నట్లు సమాచారం. అయితే జ్యూరీ సభ్యుల పూర్తి చర్చలు, ప్రతి సినిమా గురించి వారు చేసిన సమగ్ర అంచనాలు అధికారికంగా వెల్లడైన మేరకు మాత్రమే తెలుస్తాయి.
‘ధురంధర్’కు కేవలం 4 ఓట్లే..
ఆస్కార్ ఎంట్రీ కోసం పోటీపడిన ప్రముఖ చిత్రాల్లో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ కూడా ఉంది. అయితే ఈ సినిమా ఎంపిక కాలేకపోయింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ సభ్యుడు వివేక్ వాస్వానీ.. ఎన్‌డీటీవీతో మాట్లాడినప్పుడు ‘ధురంధర్’కు సంబంధించిన ఓటింగ్ వివరాలను వెల్లడించారు. సినిమాను కొంతమంది సభ్యులు ఇష్టపడ్డారని, అయితే ఆస్కార్ స్థాయికి సరిపోతుందని తాము భావించలేదని ఆయన తెలిపారు.
భారతీయ సంస్కృతిని ప్రత్యేకంగా, అర్థవంతంగా ప్రతిబింబించే చిత్రాన్ని ఎంపిక చేయాలని జ్యూరీ భావించినట్లు వివరించారు. ‘ధురంధర్’కు ఎన్ని ఓట్లు వచ్చాయని ప్రశ్నించగా.. 14 మంది సభ్యుల జ్యూరీలో నాలుగు ఓట్లు వచ్చినట్లు వివేక్ వాస్వానీ వెల్లడించారు.
గతంలో మరాఠీ చిత్రాలు:
శ్వాస్ (2004)
హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ (2009)
కోర్ట్ (2015)
భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలామ్ బాంబే’, ‘లగాన్’ సినిమాలు మాత్రమే ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో తుది ఐదు నామినేషన్ల వరకు వెళ్లాయి. గతేడాది నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్’ భారత్ తరఫున ఎంపికైనప్పటికీ, ఫైనల్ నామినేషన్ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.
మార్చి 14న ఆస్కార్ వేడుక.. ‘గోంధాల్’కు అసలు పరీక్ష..
భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైన ‘గోంధాల్’.. ఇప్పుడు ఆస్కార్ ప్రక్రియలో తదుపరి దశకు వెళ్లనుంది. 2027 మార్చి 14న లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 99వ అకాడమీ అవార్డుల వేడుక జరగనుంది. అయితే భారత అధికారిక ఎంట్రీగా ఎంపిక కావడం, తుది ఆస్కార్ నామినేషన్ దక్కడం రెండూ వేర్వేరు దశలు. ముందుగా అకాడమీ పరిశీలన, షార్ట్‌లిస్ట్ ప్రక్రియ ఉంటాయి. ఆ తర్వాత తుది నామినేషన్లు ఖరారవుతాయి. మరి మరాఠీ సంస్కృతి, గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ‘గోంధాల్’.. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ఎలాంటి గుర్తింపు తెస్తుందో చూడాలి!