Reading Time: 2 minutes
Pm Modi India Environmental Protection Economic Growth Climate Action

PM Modi: పర్యావరణాన్ని కాపాడుకుంటూనే ఆర్థికంగా ఎలా ఎదగాలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. “ది ఫ్యూచర్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ డైనమిక్స్” అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. మన దేశంలో పునరుత్పాదక ఇంధనం, పరిశుభ్రమైన రవాణా వ్యవస్థలు, నీటి సంరక్షణ ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో వివరిస్తూ, పర్యావరణ పరిరక్షణతో పాటే ఆర్థిక పురోగతి కూడా సాధ్యమేనని స్పష్టం చేశారు. ప్రకృతితో మమేకమై జీవించడం భారత్‌కు శతాబ్దాల నుంచి వస్తున్న ఆచారం అని మోడీ గుర్తుచేశారు. తరతరాలుగా పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన భారత్, ఆ సాంప్రదాయ అనుభవాలు, సిద్ధాంతాల పునాదిగానే నేటి ఆధునిక వాతావరణ సమస్యలకు పరిష్కారాలు చూపుతోందన్నారు. ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ పరిరక్షణకు కలిసికట్టుగా ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో తలసరి కార్బన్ ఉద్గారాల పరిమాణం చాలా తక్కువగా ఉందన్నారు. మన ప్రాచీన పర్యావరణ ఆలోచనలనే నేటి ఆధునిక పరిష్కారాలుగా మారుస్తూ ప్రకృతిని కాపాడుకుంటున్నామని తెలిపారు.

భారత్ వాతావరణ వ్యూహంలో పునరుత్పాదక ఇంధనానిదే ప్రధాన పాత్ర అని మోడీ స్పష్టం చేశారు. ముఖ్యంగా సౌర విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేవలం 12 ఏళ్ల క్రితం 2 గిగావాట్లుగా ఉన్న మన సోలార్ సామర్థ్యం, ఈరోజు ఏకంగా 160 గిగావాట్లకు పైగా పెరిగిందని వెల్లడించారు. ఒక్క సోలార్ ఎనర్జీ వల్లే దాదాపు 20 కోట్ల టన్నుల కార్బన్ ఉద్గారాలు వాతావరణంలో కలవకుండా నిరోధించగలిగామని చెప్పారు. పవన విద్యుత్ సామర్థ్యం కూడా గత 12 ఏళ్లలో మూడు రెట్లు పెరిగిందని, దీనికి తోడు జల విద్యుత్ రంగాన్ని కూడా విస్తరించామని చెప్పారు. వీటితో పాటు అణు విద్యుత్‌ను పెంచడానికి, క్లీన్ ఎనర్జీ రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కృషి ఫలితంగానే గత పన్నెండేళ్లలో శిలాజయేతర ఇంధనాల (Non-fossil) ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న మన దేశం, పారిస్ ఒప్పందంలో 2030 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఐదేళ్ల ముందే, అంటే 2025లోనే సాధించింది. మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 50 శాతానికి పైగా శిలాజయేతర ఇంధనాల నుంచే సాధించి భారత్ రికార్డు సృష్టించింది. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణమైన ప్రగతి సాధించిందని, ఇందులో పునరుత్పాదక ఇంధనానిదే కీలక పాత్ర అని మోడీ కొనియాడారు.