July 14, 2026

APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!

APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
Reading Time: < 1 minute
Apgef Protest Ap Govt Employees Shave Heads Target Chandrababu Over Unfulfilled Promises

APGEF Protest: అమరావతిలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (ఏపీజీఈఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఉద్యోగులు, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ఏపీజీఈఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ కాకర్ల వెంకట్రామిరెడ్డి సహా ఇతర ఉద్యోగులు గుండు చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పలువురు ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఉద్యోగులు, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వం పదవీకాలంలో సగం పూర్తయినా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరసన బాట పట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా ఉద్యోగులు గుండు చేయించుకుని ‘ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఉద్యోగుల వేతనాలు, పెండింగ్ సమస్యలు, వాలంటీర్లకు ఇచ్చిన హామీలు తదితర అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం గుండు చేయించుకుని నిర్వహించిన ఈ వినూత్న నిరసన రాష్ట్ర రాజకీయ, ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

‘గత ఎన్నికల సమయంలో ఉద్యోగులకు సీఎం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. లెక్కలేనన్ని హామీలు ఇవ్వటంతో ఉద్యోగులు ఎగబడి కూటమికి ఓట్లేసారు. ఎన్నికల సమయంలో చెప్పిన ఏ హామీ అమలు చేయలేదు. కానీ చంద్రన్న బోడిగుండు పథకం అమలు చేస్తున్నారు. నెలకు ఉద్యోగులకు ప్రభుత్వం చేసే క్షవరం 1500 కోట్లు. ఈ రెండేళ్లలో 32 వేల కోట్లు ప్రభుత్వం క్షవరం చేసింది. ఉద్యోగులకు అర్థమయ్యేలా వివరించటం కోసమే గుండు చేయించుకున్నాం. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఐదు డీఏలు, సహా అరియర్స్ పెండింగ్ ఉన్నాయి. ఐఆర్ కూడా ఇస్తామని చెప్పారు కానీ ఎగ్గొట్టింది. ఒక్కొక్క ఉద్యోగి దాదాపు ఈ రెండేళ్లలో మొత్తం 5.15 లక్షలు రావాల్సి ఉంది’ అని వెంకట్రామిరెడ్డి అన్నారు.