ఇక సెలవు.. అధికారిక లాంఛనాలతో ముగిసిన లెజెండరీ సింగర్ జానకి అంత్యక్రియలు

బెంగళూర్: సంగీత శిఖరం, లెజెండరీ ప్లే బ్యాక్ సింగర్ ఎస్. జానకి అంత్యక్రియలు అశ్రునయనాల నడుమ ముగిశాయి. ఆదివారం (జులై 12) సాయంత్రం మైసూరు సమీపంలోని కనియనహుండి దగ్గర కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మనువరాలు అప్సర వైద్యుల జానకమ్మ చితికి నిప్పంటించారు.
తన మధురమైన స్వరంతో భారత సినీ సంగీత ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఓలలాడించిన గానకోకిలను కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. భౌతికంగా జానకమ్మ మన నుంచి దూరమైనా.. పాటల రూపంలో ఆమె మనతో ఉంటారని స్మరించుకున్నారు. అంతకముందు జానకమ్మ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం మైసూరులోని మహారాజా కాలేజీ గ్రౌండ్లో ఉంచగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు హాజరై నివాళులర్పించారు.
గాన కోకిల కన్నుమూత:
సినీ సంగీత పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. లెజెండరీ సింగర్, గానకోకిల ఎస్. జానకి గొంతు మూగబోయింది. గతకొంత కాలంగా వయోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధ పడుతోన్న ఆమె మైసూర్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (జులై 11) కన్నుమూశారు.
జానకి మనువరాలు అప్సర వైద్యుల ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించారు. దీంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక శకం ముగిసింది. తన అద్భుతమైన స్వరంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గాన కోకిల జానకి మరణంపై పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ఎస్. జానకి బ్యాగ్రౌండ్:
తన మధురమైన గాత్రంతో ఆరు దశాబ్దాల పాటు కోట్ల మంది శ్రోతలను మైమరపించిన గానకోకిల, దక్షిణ భారత నైటింగేల్ ఎస్. జానకి 1938, ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పల్లపట్లలో జన్మించారు. ఏ విధమైన శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండానే తన అద్భుత స్వరంతో ఆరు దశాబ్ధాల పాటు సంగీత పరిశ్రమను ఏలారు. 1957లో తమిళ చిత్రం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీతో పాటు దాదాపు 17 భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడి సరికొత్త రికార్డు సృష్టించారు.
తన అద్భుతమైన స్వరంతో 4 జాతీయ అవార్డులు, 32 వేర్వేరు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు సాధించారు. చిన్న పిల్లల గొంతు నుంచి పండు ముసలి వారి వరకు.. ఎలాంటి పాత్రకైనా తన గొంతుతో ప్రాణం పోయడం ఆమె స్పెషాలిటీ. జానకి భౌతికంగా మన మధ్య లేకపోయినా… ఆమె పాడిన వేలాది పాటలు, ఆ మధుర స్వరం సంగీత ప్రియుల గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి.