నిర్మల్ జిల్లాలో ప్రమాదం.. క్షణాల్లో కళ్లముందే తగలబడ్డ కారు

నిర్మల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కుబీర్ మండలంలో ఒక్కసారిగా ఆగి ఉన్న కారులో మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది.కుబీర్ మండలం రంజని తండాలో ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. జామ్గాం గ్రామానికి చెందిన పండరి అనే వ్యక్తి, తన వ్యక్తిగత పని కోసం కారులో రంజని తండాకు వచ్చాడు. అక్కడ కారును రోడ్డు పక్కన ఆపి, సమీపంలోని ఒక కిరాణా దుకాణానికి వెళ్లాడు.
ఆయన కారు దిగిన కొద్దిసేపటికే… ఊహించని విధంగా కారులోంచి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. దీన్ని గమనించిన స్థానిక తండావాసులు వెంటనే అప్రమత్తమై.. మంటలను అదుపు చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ, అప్పటికే మంటలు తీవ్రరూపం దాల్చడంతో క్షణాల వ్యవధిలోనే మంటలు కారంతటా వ్యాపించాయి. కారు పూర్తిగా అగ్నికి ఆహుతై, కళ్ల ముందే కాలి బూడిదైంది
అయితే కారులో మంటలు చెలరేగడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.