వాకిట్లో కెమికల్ ముగ్గులు.. పేడకు బదులు కెమికల్ పౌడర్..ఆరోగ్యం, పర్యావరణానికి ముప్పు!

- వాకిట్లో కెమికల్స్..సాంపి చల్లేందుకు పెండకు బదులు కెమికల్ పౌడర్ల వినియోగం
- రూ.10 నుంచి 20కే ప్యాకెట్.. తక్కువ ఖర్చు, శ్రమ లేదని మహిళల మొగ్గు
- స్కిన్ అలర్జీలు, శ్వాసకోస సమస్యలు వస్తాయంటున్న డాక్టర్లు
- సింథటిక్ కెమికల్స్‌తో పర్యావరణానికీ ముప్పంటున్న నిపుణులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒకప్పుడు ప్రతి వాకిట్లో తెల్లవారుజామున సాంపి (కళ్లాపి) చల్లి ముగ్గు వేయడం నిత్యకృత్యంగా ఉండేది. ఇప్పుడు నగరాలతో పాటు గ్రామాల్లోనూ పెండ దొరకడం కష్టంగా మారడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా కెమికల్ పౌడర్లు, లిక్విడ్ రంగులను వినియోగిస్తున్నారు. రూ.10 నుంచి రూ.20కే లభిస్తున్న సాంపి పౌడర్, ఫ్లోర్ రంగోలి లిక్విడ్, ఇన్‌స్టంట్ ముగ్గు వాటర్ పౌడర్‌ను నీటిలో కలిపి వారానికి రెండు, మూడు సార్లు వాకిట్లో చల్లుతున్నారు. వీటి వల్ల అనారోగ్య సమస్యలతో పాటు పర్యావరణానికీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు, పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెండ కొరతే ప్రధాన కారణం
నగరాల్లో పశువుల పెంపకం దాదాపుగా లేకపోవడం, గోశాలలు, పశువుల పాకలు దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల తాజా పెండ దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లోనూ వ్యవసాయ యాంత్రీకరణ వల్ల పశువుల సంఖ్య తగ్గడంతో పెండ కరువైంది. మరోవైపు ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి పెండ తీసుకొచ్చి నీటిలో కలిపి వాకిట్లో చల్లేంత సమయం దొరకడంలేదు. పైగా మట్టి వాకిళ్ల స్థానంలో టైల్స్, గ్రానైట్, సిమెంట్ ఫ్లోరింగ్ రావడంతో పెండ చల్లితే శుభ్రం చేయడం కష్టమవుతుందనే భావన కూడా ప్రత్యామ్నాయాల వైపు వెళ్లేలా చేస్తోంది.
ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మార్కెట్లో కొందరు సాంపి పౌడర్‌ను విస్తృతంగా అమ్ముతున్నారు. స్థానిక కిరాణా దుకాణాలు, ఆన్‌లైన్‌లో రూ.10 నుంచి రూ.20కే ఈ ప్యాకెట్లు లభిస్తున్నాయి. దాంతో మధ్యతరగతి మహిళలు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. వారానికి రెండు, మూడు సార్లు నీళ్లలో కలిపి వాకిట్లో చల్లుతున్నారు.
కెమికల్స్‌తో చర్మ వ్యాధులు
ఈ రంగుల్లో వస్త్ర పరిశ్రమలో ఉపయోగించే యాసిడ్ గ్రీన్, రోడమైన్ – బి వంటి సింథటిక్ కలర్స్, కెమికల్స్కలిపిన సుద్దపొడి, జింక్ ఆక్సైడ్, లిక్విడ్ కెమికల్ కలర్స్, మెరిసేలా కనిపించేందుకు కొన్ని చోట్ల మెటాలిక్ పౌడర్లను కలుపుతున్నట్లు తెలుస్తోంది. వీటి తయారీపై స్పష్టమైన నియంత్రణ లేకపోవడంతో నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కెమికల్స్‌ను తరచుగా చేతులతో కలపడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
కాంటాక్ట్ డెర్మటైటిస్, చర్మం ఎర్రబడటం, దురద, మంట, అలర్జీలు, చర్మం పొరలుగా ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చని చెప్తున్నారు. ఇప్పటికే ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మవ్యాధులతో బాధపడుతున్నవారిలో ఈ ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. కొందరిలో గోళ్ల బలహీనత, గోళ్ల చుట్టూ ఇన్ఫెక్షన్లు కూడా తలెత్తవచ్చని డాక్టర్లు చెప్తున్నారు.
శ్వాసకోశ సమస్యలు
రంగు నీళ్లు ఆరిపోయిన తర్వాత వాకిట్లోని కెమికల్స్ కలిసిన సూక్ష్మ ధూళి గాలిలోకి చేరుతుంది. ఆ కణాలు శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్లడం వల్ల ఆస్తమా, అలెర్జిక్ రైనైటిస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలున్న వారి ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఇలాంటి కెమికల్స్‌కు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది.
ఈ పౌడర్లు కళ్లలో పడితే మంట, ఎర్రబారడం, నీరు కారడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. నాణ్యతలేని రంగుల్లో హానికరమైన లోహాలు లేదా ఇతర రసాయనాలు ఉంటే, దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అనారోగ్య సమస్యలతో పాటు పర్యావరణంపై కూడా ఈ రసాయనాల ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కెమికల్స్ కలిసిన నీరు మురుగునీటి కాల్వల్లోకి వెళ్లి నేల, నీటి నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి
పెండ దొరక్కపోతే కెమికల్ రంగులు వాడొద్దని, వీలైనంత వరకు సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పసుపు కలిపిన నీరు, వేపాకుల కషాయం, ఇతర పర్యావరణహిత ద్రావణాలు లేదా సహజ పదార్థాలతో తయారైన బయో డిగ్రేడబుల్ రంగులను వినియోగించడం వల్ల అనారోగ్య, పర్యావరణ ముప్పును కొంతవరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు.
పౌడర్‌తోనే చల్లుతున్నాం
వారానికి రెండు సార్లు కెమికల్ పౌడర్‌తోనే సాంపి చల్లుతున్నాం. పెండ ఎక్కడా దొరకడం లేదు. అందుకే బండి మీద అమ్మేందుకు వస్తున్న వారి దగ్గర కలర్ పౌడర్ కొంటున్నాం. పది రూపాయలకు ఒక ప్యాకెట్ వస్తుంది. సాంపి కోసం కలర్ పౌడర్ కొనేందుకు నెలకు రూ. 100 వరకు ఖర్చు చేస్తున్నాం.
– మహిళ, ఇబ్రహీంపట్నం