విద్యాభివృద్ధికి సర్కారు పెద్దపీట : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

- కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి భూమిపూజ
జగిత్యాల టౌన్, వెలుగు: రాష్ట్రంలో విద్యాభివృద్ధిపై కాంగ్రెస్సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందుకు విశేష కృషి చేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సత్య ప్రసాద్‌తో కలిసి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సంజయ్ కృషితోనే వ్యవసాయ క్షేత్రంలోని ఐదెకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించామని పేర్కొంటూ ఇందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో మరిన్ని విద్యాసంస్థలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామా అని.. దేశవ్యాప్తంగా 1,289, తెలంగాణలో 37 కేవీలు పనిచేస్తున్నాయని తెలిపారు. జగిత్యాలకు కేవీ మంజూరు చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్ అవసరాల దృష్ట్యా మరో ఐదు ఎకరాల భూమిని అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా పాత ఎస్పీ కార్యాలయ భవనంలోనే కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెల్లడించారు.