July 15, 2026

షాపింగ్ కోసం కార్డులు స్వైప్ చేస్తున్న జెన్‌జీ.. భవిష్యత్తుకు ముప్పేనా?

షాపింగ్ కోసం కార్డులు స్వైప్ చేస్తున్న జెన్‌జీ.. భవిష్యత్తుకు ముప్పేనా?
Reading Time: 2 minutes

ఒకప్పుడు పెద్దలకే పరిమితమైన మొబైల్ ఫోన్లు, ఇప్పుడు చిన్న పిల్లల చేతుల్లోకి వచ్చేసాయి. అదే పద్ధతిలో, ఇప్పుడు క్రెడిట్ కార్డుల వాడకం కూడా మారిపోయింది. నేటి యువత (జెన్‌జీ) షాపింగ్, ఎంజాయ్‌మెంట్ కోసం విచ్చలవిడిగా క్రెడిట్ కార్డులను స్వైప్ చేస్తున్నారు. పట్టణాలకే కాకుండా పల్లెటూరి యువతకు కూడా ఇవి బాగా అలవాటయ్యాయి. అయితే, ఈజీగా వస్తున్న అప్పుల వెనుక ఉన్న డేంజర్ ఏంటి? ఇది జెన్‌జీ భవిష్యత్తుకు ముప్పేనా? తాజాగా వచ్చిన రిపోర్టులు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

నివేదికలు ఏం చెబుతున్నాయి?: క్రెడిట్ కార్డుల వినియోగంపై వచ్చిన లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. నేటి యూత్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ (EMI) లపై బాగా ఆధారపడుతున్నారు. ఇక క్రెడిట్ కార్డు తీసుకున్న కేవలం మూడు నెలల్లోనే దాదాపు 28 శాతం మంది జెన్‌జీ యువత అప్పు రూ. 25,000 దాటిపోతోంది. అంతటితో ఆగకుండా, మొదటి కార్డు వచ్చిన ఏడాది లోపే 69 శాతం మంది రెండో క్రెడిట్ కార్డును కూడా తీసుకుంటుండడం విశేషం.

Gen Z Is Swiping More Than Ever: A Risk to Their Financial Future?
Gen Z Is Swiping More Than Ever: A Risk to Their Financial Future?

చిన్న నగరాలు, పల్లెటూళ్లలోనే ఎక్కువ: రిపోర్టుల ప్రకారం.. మొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకుంటున్న వారిలో సగం మంది (50 శాతం) 30 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. ఇక ఇందులో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, కార్డులు తీసుకునే వారిలో 46 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే. అంటే ఇప్పుడు సిటీల కంటే పల్లెల్లోనే క్రెడిట్ కార్డుల క్రేజ్ వేగంగా పెరుగుతోందని అర్థమవుతోంది.

భారీగా పెరిగిన కార్డుల సంఖ్య: గణాంకాల ప్రకారం చూస్తే క్రెడిట్ కార్డులు వాడుతున్న వారి సంఖ్య 52 మిలియన్లకు చేరింది. అలాగే వాడుకలో ఉన్న యాక్టివ్ కార్డుల సంఖ్య ఏకంగా ఐదు రెట్లు పెరిగి 107 మిలియన్లకు చేరిపోయింది. ఇక దీన్ని బట్టి బ్యాంకులు కూడా విచ్చలవిడిగా కార్డులు ఇస్తూ, ‘ఇప్పుడు షాపింగ్ చేయండి.. తర్వాత నిదానంగా కట్టండి’ (BNPL) అంటూ రకరకాల ఆఫర్లతో యువతను ఆకర్షిస్తున్నాయి.

జేబులో డబ్బులు లేకపోయినా వస్తువులు కొనే సదుపాయం బాగుంది కదా అని అలవాటు పడితే, ఆ తర్వాత కట్టేటప్పుడు తడిసి మోపెడవుతుంది. క్రెడిట్ కార్డు లేదా బై నౌ పే లేటర్ (BNPL) ఆప్షన్లను వాడే ముందు వాటి ఛార్జీలు, వడ్డీల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అవసరానికి వాడితేనే క్రెడిట్ కార్డ్ ఒక వరం, లేదంటే జీవితాంతం అప్పుల ఊబిలో నెట్టేసే శాపం.

గమనిక: క్రెడిట్ కార్డు బిల్లును ప్రతి నెలా డ్యూ డేట్ లోపు పూర్తిగా చెల్లించాలి. కేవలం మినిమం అమౌంట్ మాత్రమే కడితే మిగిలిన బాకీపై బ్యాంకులు భారీగా చక్రవడ్డీలు, లేట్ ఫీజులు వసూలు చేస్తాయి.

The post షాపింగ్ కోసం కార్డులు స్వైప్ చేస్తున్న జెన్‌జీ.. భవిష్యత్తుకు ముప్పేనా? appeared first on Manalokam – Latest Telugu News & Updates.