July 13, 2026

Andhra Pradesh: ఎన్నో ఏళ్ల చరిత్ర.. ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. నేడు పనులకు శ్రీకారం

Andhra Pradesh: ఎన్నో ఏళ్ల చరిత్ర.. ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. నేడు పనులకు శ్రీకారం
Reading Time: < 1 minute
Andhra Pradesh: ఎన్నో ఏళ్ల చరిత్ర.. ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లు.. నేడు పనులకు శ్రీకారం

ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడిగా, లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరు అందిస్తున్న సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు ఏపీలోని కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాలం చెల్లిన పాత గేట్ల స్థానంలో కొత్తవి అమర్చే పనులను ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ బృహత్ కార్యక్రమం ద్వారా బ్యారేజీని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. బ్యారేజీ గేట్లను నిర్మించి 50 ఏళ్లు దాటడంతో వాటి సర్వీస్ లైఫ్ ముగిసిందని, వాటిని మార్చాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) గతంలోనే సిఫార్సు చేసింది. ఈ సూచనల మేరకు, ప్రస్తుత ప్రభుత్వం బ్యారేజీ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఆధునికీకరణ పనులకు పరిపాలనా ఆమోదం తెలిపింది. మొత్తం రూ.152.95 కోట్ల వ్యయంతో ఈ పనులను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా శిథిలావస్థకు చేరిన 117 ఫ్లడ్ గేట్లను పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో అధునాతనమైన కొత్త గేట్లను బిగించనున్నారు. దీంతో పాటు, 12 హెడ్ స్లూయిజ్ గేట్లకు మరమ్మతులు, 175 క్రెస్ట్ గేట్లకు కొత్త రబ్బరు సీల్స్, 734 రోలర్ బేరింగ్స్ అమర్చనున్నారు. బీఈసీఓఎమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పనులను దక్కించుకోగా, రెండేళ్లలో పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించనుంది…

గత వైసీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం చూపిందన్న విమర్శలు ఉన్నాయి. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేదని, ధవళేశ్వరం బ్యారేజీ విషయంలోనూ కనీస మరమ్మతులు చేపట్టలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే, 2014లో టీడీపీ ప్రభుత్వం రూ.31.77 కోట్లతో 58 గేట్లకు మరమ్మతులు చేయించింది. ఇప్పుడు పూర్తిస్థాయి ఆధునికీకరణకు నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

నేడు ముఖ్యమంత్రి పర్యటన వివరాలు

ఈరోజు ఉదయం 10:25 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, 11:25 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నూతన గేట్ల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11:45 గంటలకు ఆత్రేయాపురం మండలం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:20 గంటలకు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. అక్కడ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 పనులు, పవర్ హౌస్ నిర్మాణాన్ని పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5:20 గంటలకు పోలవరం పర్యటన ముగించుకుని తిరిగి అమరావతికి చేరుకుంటారు…..