వాడు ఇంత ప్రశాంతంగా చావడమేంటి సర్..? షాబాద్ ఆరు హత్యల నిందితుడి అన్న కామెంట్స్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లాలో ఆరు హత్యల నిందితుడు రాజ్ కుమార్ చనిపోయిన పరిస్థితుల్లో పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే. కన్నబిడ్డలన్న జాలి లేకుండా.. రెండు, మూడేండ్ల పసి ప్రాయం అని కూడా చూడకుండా.. మొత్తం ఆరుగురిని అత్యంత కిరాతకంగా గొంతులు కోసి, పొడిచి చంపిన నరరూప రాక్షసుడు చనిపోవడంపై నిందితుడి అన్న చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నిందితుడు చనిపోయిన స్పాట్ కు పోలీసుల తో పాటు వెళ్లిన బంధువులు భావోద్వేగంతో ఆగ్రహానికి గురయ్యారు.
ఇంత మంది జీవితాలన్ని నాశనం చేసిన కిరాతకుడు ఇంత ప్రశాంతంగా చనిపోవడమేంటి సార్.. అంటూ పోలీసుల ముందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు నిందితుడి అన్న. వీడు ఇంత ఈజీగా చావడమేంటి సార్. రెండేండ్ల పిల్లలను కూడా గొంతులు కోసి చంపాడు సార్. నరరూప రాక్షసుడు సార్ వాడు. వాళ్లు అనుభవించిన వేదన వీడికి కూడా చూపించాల్సింది సార్. వాడిని పట్టుకుని వాళ్లు అనుభవించిన నరకం వీడికి కూడా చూపించి చంపాల్సింది సార్. కాల్చి చంపేదుండే ఈ రాక్షసున్ని.. ఇంత ప్రశాంతంగా చనిపోవడమేంటి సార్.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో హృదయాన్ని ద్రవింపజేస్తోంది.
వాడు ఇంతకు ముందే మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అప్పుడు చనిపోయినా ఈ పరిస్థితి ఉండేది కాదేమో సార్. వాడిని అనవసరంగా బతికించాం. ఇంత మంది జీవితాలను నాశనం చేసిన వీడు ఇంత ప్రశాంతంగా చనిపోయాడు. చిన్న పిల్లలను కూడా చూడలేదు సార్ వీడు. వదిలేసి ఉంటే నేను బతికించుకునే వాడిని సార్ ఆ బిడ్డలను అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పోలీసులు అతడిని ఓదార్చి శవం నుంచి దూరంగా తీసుకెళ్లారు.
రాజ్ కుమార్ చనిపోవడంపై బాధిత మైనర్ మేనమామ నరేష్ కూడా స్పందించారు. నరరూప రాక్షసుడు చనిపోవడంతో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగిందని అన్నారు. కానీ ఇంకా ముందుగానే జరగాల్సిందని అన్నారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు న్యాయం జరగాల్సి ఉందని.. సహాయం అందితే అప్పుడు పూర్తిగా న్యాయం జరిగినట్లు అని అన్నారు.
►ALSO READ | షాబాద్ నిందితుడు రాజ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
తనపై పోక్సో కేసు పెట్టిందనే కారణంతో ఓ బాలికపై కక్ష పెట్టుకొని సైకోలా మారిన రాజ్ కుమార్ మారణహోమం సృష్టించాడు. అర్ధరాత్రి కత్తితో ఇంట్లో చొరబడి బాలిక కళ్ల ముందే ఆమె తల్లిని, నానమ్మను పొడిచి చంపాడు. అక్కడి నుంచి బాలికను కారులో తీసుకెళ్లి హతమార్చాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి.. తన సొంత భార్యా పిల్లల గొంతుకోశాడు. ‘‘ఆరుగురినీ చంపేశాను.. నేనూ చస్తున్నాను’’ అంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పి, మొబైల్ స్విచ్ఛాఫ్ చేశాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఊచకోత.. స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది.
ఎలా జరిగిందంటే..
పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ శుక్రవారం రాత్రి 11.10 గంటల నుంచి 11.45 గంటల మధ్య సమయంలో కేవలం అరగంట వ్యవధిలో ఆరు ప్రాణాలను తీశాడు. శుక్రవారం రాత్రి సెల్ఫ్ డ్రైవ్ కారు తీసుకున్నాడు. రాత్రి 11.10 గంటలకు బాలిక ఇంటికి వచ్చాడు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించాడు. తలుపు కొట్టడంతో బాలిక తల్లి డోర్ ఓపెన్ చేసింది. బాలికను తనతో లాక్కెళ్లే ప్రయత్నం చేయడంతో తల్లి అడ్డుపడింది. దీంతో తన చేతిలో కత్తితో కడుపు, ఛాతిలో ఆరు పోట్లు పొడిచాడు. నిద్రిస్తున్న బాలిక నాయనమ్మ రుక్కమ్మను పొడిచి చంపాడు. అరిస్తే చంపేస్తానని బెదిరిస్తూ.. బాలికను బలవంతంగా ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు.
సమీపంలోని అఖిల్‌సాగర్ చెరువు వద్ద ఆమె గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం దైవాలగూడలోని తన ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టడంతో భార్య డోర్ ఓపెన్ చేసింది. దీంతో ఆమెపై దాడి చేసి కడుపులో బలంగా మూడు పోట్లు పొడిచాడు. అరవకుండా గొంతుకోశాడు. పక్కనే బెడ్‌పై నిద్రిస్తున్న పరీక్షిత్, దైవీక్షిత్ గొంతులు కోశాడు.