రూ.91 వేల కోట్ల స్పోర్ట్స్ డీల్.. సియాటిల్ సీహాక్స్‌ను సొంతం చేసుకున్న భారతీయుడు!

అమెరికన్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ చరిత్రలోనే అత్యంత భారీ ఒప్పందాల్లో ఒకటి నమోదైంది. భారతీయ మూలాలు కలిగిన సిలికాన్ వ్యాలీ దిగ్గజ పెట్టుబడిదారు వినోద్ ఖోస్లా సూపర్ బౌల్ విజేత సియాటిల్ సీహాక్స్‌ను 9.6 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం దీని విలువ రూ.91వేల 200 కోట్లుగా ఉంది. ఈ డీల్‌తో ఇప్పటివరకు ఏ ఎన్‌ఎఫ్‌ఎల్ జట్టుకూ లేని అత్యధిక ధర పలికింది. ఇది కేవలం ఒక జట్టు ఓనర్షిప్ మారడం మాత్రమే కాదు.. గ్లోబల్ స్పోర్ట్స్ రంగంలో టెక్నాలజీ బిలియనీర్ల ప్రభావం ఎంత వేగంగా పెరుగుతోందో చెప్పే మరో కీలక మైలురాయి.
ఇప్పటి వరకు ఎన్‌ఎఫ్‌ఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ కొనుగోలు రికార్డు 2023లో వాషింగ్టన్ కమాండర్స్ కోసం చెల్లించిన 6.05 బిలియన్ డాలర్లదే. కానీ ఇప్పుడు సీహాక్స్ 9.6 బిలియన్ డాలర్ల విలువతో ఆ రికార్డును భారీ తేడాతో అధిగమించింది. ఇటీవల సూపర్ బౌల్ విజయంతో జట్టు బ్రాండ్ విలువ మరింత పెరగడం, వాణిజ్యపరంగా బలమైన స్థాయిలో ఉండటం ఈ భారీ ధరకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
వినోద్ ఖోస్లా ప్రయాణం భారతదేశంలో ప్రారంభమై సిలికాన్ వ్యాలీలో సక్సెస్ స్టోరీగా మారింది. ఐఐటీ ఢిల్లీ నుంచి డిగ్రీ పొందాక ఆయన అమెరికాకు వెళ్లి సన్ మైక్రోసిస్టమ్స్‌ను కో ఫౌండర్ అయ్యారు. అనంతరం ఖోస్లా వెంచర్స్‌ను ప్రారంభించి ఏఐ, హెల్త్ కేర్, క్లీన్ ఎనర్జీ, సాఫ్ట్‌వేర్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. టెక్ ప్రపంచంలోని విజయాన్ని ఇప్పుడు ప్రపంచ క్రీడారంగంలోనూ రిపీట్ చేయాలని చూస్తున్నారు.
సీహాక్స్‌ను 1997లో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు పాల్ అలెన్ 194 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఆయన మరణం తర్వాత సోదరి జోడి అలెన్ ఆధ్వర్యంలో జట్టు కొనసాగింది. పాల్ అలెన్ ఇచ్చిన ఆదేశాల మేరకు జట్టును విక్రయించి వచ్చిన నిధులను సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఎన్‌ఎఫ్‌ఎల్ అనుమతి లభించిన తర్వాత నీరూ ఖోస్లా జట్టు నియంత్రణ బాధ్యతలు చేపట్టనుండగా, వినోద్ ఖోస్లా కూడా కుటుంబ సభ్యులతో కలిసి కీలక పాత్ర పోషించనున్నారు. మెుత్తానికి మెగా స్పోర్ట్స్ డీల్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీయటంతో పాటు కొత్త శకానికి నాంది పలికిందని నిపుణులు అంటున్నారు.