Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..

Bihar: బీహార్ వైశాలి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా హోంగార్డ్, ఆమె సోదరిని అపహరించి అత్యాచారం చేశారనే ఆరోపణలు కలకలం రేపాయి. గోరౌల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. బాధితురాలి కుటుంబీకులు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, ఇది ప్రేమ వ్యహారానికి సంబంధించిన విషయమని పోలీసులు చెబుతున్నారు.
కుటుంబీకుల చెబుతున్న దాని ప్రకారం.. మహిళా హోంగార్డ్, ఆమె సోదరి మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో, అదే గ్రామానికి చెందిన సుబోధ్ పాశ్వాన్, అతడి సోదరుడు, మరో ఇద్దరు సహచరులు కలిసి వారిని అపహరించారు. నిందితులు మహిళా కానిస్టేబుల్‌ను ఇంట్లో బంధించి అత్యాచారం చేశారని ఆరోపించారు. ఈ ఘటన గురించి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడి ఇంటిపై దాడి చేసి, బాధిత కానిస్టేబుల్‌ను రక్షించారు. కానీ నిందితుడు పారిపోయాడు.
అయితే, ఈ వ్యవహారంపై మహువా పోలీస్ అధికారి సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. కిడ్నాప్, అత్యాచారం ఆరోపణల్ని ఖండించారు. ఈ కేసు ప్రధానంగా ఒక ప్రేమ వ్యవహారంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుల్‌కు గతంలో నిందితుడితో ప్రేమ ఉందని, ఉద్యోగం వచ్చిన తర్వాత బాధితురాలు అతడిని దూరం పెట్టిందని చెప్పారు. కోపంతోనే నిందితుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. గతంలో వీరిద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ జరిగిందని కూడా వెల్లడించాడు. కుటుంబీకుల ఫిర్యాదు తర్వాత మహిళా కానిస్టేబుల్‌ను వైద్య పరీక్షలకు పంపించారు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.