July 14, 2026

మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం: ఆహార ధరల సెగ.. జూన్‌లో ఇన్‌ఫ్లేషన్ 4.38 శాతం

మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం: ఆహార ధరల సెగ.. జూన్‌లో ఇన్‌ఫ్లేషన్ 4.38 శాతం
Reading Time: < 1 minute

మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం: ఆహార ధరల సెగ.. జూన్‌లో ఇన్‌ఫ్లేషన్ 4.38 శాతం

Caption of Image.

ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న సమయంలో జూన్ నెల గణాంకాలు మరోసారి ఆందోళన కలిగించాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో నమోదైన 3.93 శాతం నుంచి జూన్‌లో 4.38 శాతానికి చేరుకుంది. గత 6 నెలల్లో ఇదే అత్యధిక స్థాయి. దీంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4 శాతం లక్ష్యాన్ని కూడా ద్రవ్యోల్బణం దాటేసింది. ప్రధానంగా ఆహార ధరలు, రవాణా ఖర్చులు పెరగడమే ఈ పెరుగుదలకు కీలక కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఈసారి ద్రవ్యోల్బణాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన అంశం ఆహార ధరలే. మేలో 4.78 శాతంగా ఉన్న ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ జూన్‌లో 5.32 శాతానికి చేరుకుంది. వినియోగదారుల ధరల సూచీలో ఆహార పదార్థాల వాటా దాదాపు సగం ఉండటంతో, వాటి ధరల్లో పెరుగుదల నేరుగా మొత్తం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపింది. ముఖ్యంగా హోటళ్లలో ఫుడ్ అండ్ బెవరేజెస్ ధరలు 6.94 శాతం పెరిగాయి. అలాగే పర్సనల్ వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చులు 7.35 శాతం, సరుకు రవాణా సేవల ఖర్చులు 7.70 శాతం పెరగడం కూడా ధరలపై అదనపు ఒత్తిడిని తీసుకొచ్చింది.

►ALSO READ | పడిపోయిన ల్యాబ్ డైమండ్ రేట్లు.. అప్పట్లో లక్ష.. ఇప్పుడు రూ.12వేలకే!

అయితే కొన్ని వస్తువుల ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. వాహనాల కొనుగోలు విభాగంలో ద్రవ్యోల్బణం -4.59 శాతంగా నమోదవగా, వినోదానికి సంబంధించిన కొన్ని ఉత్పత్తులు, గృహోపకరణాల ధరలు కూడా తగ్గాయి. అయితే నగలు వంటి వ్యక్తిగత విలువైన వస్తువుల ధరలు ఇంకా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 50.17 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4.74 శాతానికి పెరగగా, పట్టణాల్లో అది 3.92 శాతంగా నమోదైంది. అంటే గ్రామీణ ప్రజలపై ఆహార ధరల ప్రభావం మరింత ఎక్కువగా ఉందన్న మాట. గత 5 నెలలుగా తగ్గుముఖం పట్టిన ద్రవ్యోల్బణం జూన్‌లో మళ్లీ పెరగడం, రాబోయే నెలల్లో ఆహార ధరలు ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి ప్రధాన సవాలుగా మారే అవకాశాన్ని సూచిస్తోంది.

©️ VIL Media Pvt Ltd.