అర్హులైన ప్రతి ఒక్కరితో ‘సర్’ఫారాలు నింపించాలి : మంత్రి దామోదర రాజనర్సింహ

రాయికోడ్/మునిపల్లి, వెలుగు : రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను మరో 15 రోజుల్లో పూర్తి చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరితో ఫారాలు నింపించి నిర్ణీత గడువులోగా ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఆదివారం రాయికోడ్, మునిపల్లి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, సర్పంచులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో సర్ ప్రక్రియపై ఉన్న అపోహలను నివృత్తి చేస్తూ ఇంటింటికీ వెళ్లి ఓటు హక్కు నమోదును సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం అభివృద్ధి పనులపై సమీక్షించారు. మునిపల్లి చౌరస్తా నుంచి సిరూర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. తక్కడపల్లి-గార్లపల్లి వంతెన పనులను దసరా నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ వినయ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.