జైలుకు వెళ్తే శాశ్వత తొలగింపు వద్దు.. సస్పెన్షన్ చాలు..పార్లమెంటరీ కమిటీ సంచలన సిఫార్సు

- శాశ్వత తొలగింపు వద్దు.. సస్పెన్షన్ చాలు!
- ప్రజా ప్రతినిధుల జైలు నిర్బంధంపై పార్లమెంటరీ కమిటీ కీలక సిఫార్సులు
- కోర్టులో నిర్దోషిగా తేలితే ఆటోమేటిక్‌గా తిరిగి పదవి దక్కేలా రక్షణ క్లాజ్
న్యూఢిల్లీ: తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలపై వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో (జైల్లో) ఉన్న ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సీఎంలను పదవుల నుంచి శాశ్వతంగా ‘తొలగించడం’ సరికాదని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. అలాంటి సందర్భాల్లో వారిని కేవలం ‘సస్పెండ్’ మాత్రమే చేయాలని, శాశ్వత తొలగింపు వద్దని పార్లమెంటరీ జాయింట్ కమిటీ సంచలన సిఫార్సు చేసింది.130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలిస్తున్న ఈ జాయింట్ కమిటీ.. ప్రతిపక్షాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని 2 నిర్దిష్ట, 3 సాధారణ సిఫార్సులతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. ఒకవేళ కమిటీ చేసిన ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనిపై కేబినెట్ ఆమోదం పొంది, ఆ తర్వాత లోక్‌సభలో అధికారిక సవరణలను ప్రవేశపెట్టనుంది.
సిఫార్సుల్లోని ముఖ్యాంశాలు ఇవే
- చట్టపరమైన విచారణ ప్రక్రియ ముగిసేవరకు సదరు నేతలను సస్పెన్షన్లోనే ఉంచాలి కానీ, శాశ్వతంగా పదవి నుంచి తొలగించకూడదు. ఇది ప్రభుత్వాల స్థిరత్వానికి భరోసా ఇస్తుంది.
- ఒకవేళ సదరు నేతను కోర్టు నిర్దోషిగా తేల్చినా, నిర్ణీత గడువులోగా ప్రాసిక్యూషన్ ప్రక్రియ ముందుకు సాగకపోయినా.. వారిపై ఉన్న సస్పెన్షన్ ఆటోమేటిక్‌గా రద్దయి, తిరిగి పదవి దక్కేలా రక్షణ కల్పించాలి.
- ఐదేండ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలనే ‘తీవ్రమైన క్రిమినల్ నేరాలు’గా పరిగణించాలి. ఇందుకు సంబంధించి బిల్లులో ప్రత్యేక షెడ్యూల్‌ను చేర్చాలి.
- అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై వచ్చే కేసుల విచారణను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక లేదా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో వేగంగా చేపట్టాలి.