July 12, 2026

దళితులు గ్రూప్ లు,సబ్ గ్రూప్ లు పెట్టుకోవద్దు..మాలలకు న్యాయం జరగకపోతే  ముందుండి పోరాడుతా: మంత్రి వివేక్ 

దళితులు గ్రూప్ లు,సబ్ గ్రూప్ లు పెట్టుకోవద్దు..మాలలకు న్యాయం జరగకపోతే  ముందుండి పోరాడుతా: మంత్రి వివేక్ 
Reading Time: 2 minutes

దళితులు గ్రూప్ లు,సబ్ గ్రూప్ లు పెట్టుకోవద్దు..మాలలకు న్యాయం జరగకపోతే  ముందుండి పోరాడుతా: మంత్రి వివేక్ 

Caption of Image.

దళితులు గ్రూప్ లు, సబ్ గ్రూప్ లు పెట్టుకోవద్దన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఒకవేళ మాలలకు న్యాయం జరగకపోతే తానే స్వయంగా ముందుండి పోరాటం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

భద్రాచలంలో అంబేద్కర్ విగ్రాహావిష్కరణలో పాల్గొన్న వివేక్..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు, త్యాగాలు అమూల్యమైనవని  అన్నారు.  అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలను కొనియాడారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి అంబేద్కర్ విగ్రహాన్ని తానే స్పాన్సర్ చేశానని చెప్పారు .. స్టేజీపై మాట్లాడిన మాటలను ఎవరూ మర్చిపోవద్దని హితవు పలికారు. నాటి గాంధీతో సైతం విభేదించి, పోరాడి హక్కులు సాధించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగ హక్కులు కేవలం దళితులకే కాకుండా, అన్ని వర్గాల ప్రజలకు రక్షణగా నిలిచాయన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే.. దానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.

ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్న వివేక్ వెంకటస్వామి.. అంబేద్కర్ ఎన్నో ఇబ్బందులను అధిగమించి 23 డిగ్రీలు సాధించారని, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పట్టా పొందారని తెలిపారు. దేశానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉండాలని 1924 లోనే అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, నేటి తరం అంతా ఆయన చరిత్రను తప్పకుండా చదవాలని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ చూపిన బాటలో.. సమాజం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ తిరిగి సమాజానికి సేవ చేయాలని (Give Back to Society) మంత్రి కోరారు. దళిత రిజర్వేషన్లతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగిన కొందరు.. రిటైర్ అయ్యాక కనీసం దళిత వర్గాలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సింగరేణిలో సైతం అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లే నేడు దళిత అధికారులు ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని గుర్తుచేశారు.

అంబేద్కర్ హైదరాబాద్ వచ్చినప్పుడు తన తండ్రి (కాకా వెంకటస్వామి)కి ఆయనను కలిసే అదృష్టం దక్కిందని, అందుకే తాము అంబేద్కర్ కాలేజీని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కాలేజీ ద్వారా ఇప్పటివరకు రెండు లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసించారని తెలిపారు. సమాజానికి తిరిగి సేవ చేయడం వల్ల మంచి ఆలోచనలు రావడమే కాకుండా ఆరోగ్యం కూడా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

 అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడే కొందరు ఆయన కార్యక్రమాలకు రాకపోవడం విచారకరమన్నారు.  స్థానిక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ (MP LADS) ద్వారా, స్థానిక ఎమ్మెల్యే ద్వారా అవసరమైన నిధులు ఇప్పిస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.

 

©️ VIL Media Pvt Ltd.