LPG Gas Supply: మళ్లీ ముదిరిన వార్.. సామాన్యులపై మరోసారి భారం.. గ్యాస్ ధరలు మళ్లీ పెరుగుతాయా..?

అమెరికా-ఇరాన్ మధ్య యుద్దంతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ ముడి చమురు, ఎల్పీజీ సరఫరాకు కీలకమైన ఇరుకైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. దీని ప్రభావం భారత్‌పై ఎక్కువ పడనుంది. భారత్ ఎక్కువగా ముడి చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. దీంతో అంతర్జాతీయంగా యుద్దాలు జరిగి అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతూ వస్తుంటాయి. గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ద సమయంలో భారీగా పెరగ్గా.. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య యుద్దంతో మరోసారి పెరిగాయి. ఇప్పుడు యుద్దం తిరిగి ప్రారంభం కావడంతో త్వరలో మరింతగా పెరిగే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎల్పీజీ దిగుమతుల కోసం గల్ఫ్ దేశాలపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉంది. గల్ప్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడులను ప్రారంభించడంతో.. యుద్దం మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. దీంతో భారత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే దిగుమతి చేసుకునే ముడి చమురు, సహజ వాయువులపై భారతదేశ వ్యయం నేరుగా పెరుగుతుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రమైతే.. దేశంలో చమురు, గ్యాస్ ధరలు పెరుగుతాయని నిపుణులు చెబతున్నారు. ఇరాన్ పలు గల్ఫ్ దేశాలపై జరిపిన దాడుల ప్రభావం షిప్పింగ్ రంగానికే పరిమితం కాదని అంటున్నారు. అమెరికా దాడుల తర్వాత ఇరాన్ అనేక గల్ఫ్ దేశాలపై బాంబు దాడులు చేస్తోంది. దీనివల్ల చమురు, గ్యాస్ ఉత్పత్తిపై కూడా తీవ్ర ప్రభావం పడొచ్చని అంటున్నారు. అయితే ఇరాన్‌తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరిపాలని, భారత్ కోసం హర్ముజ్ జలసంధి తెరిచేలా ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు. ఇటీవల భారత నౌకపై ఇరాన్ దాడికి పాల్పడిన క్రమంలో భారత నావికుల సురక్షితంగా ఉండేలా కేంద్రం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
భారత్‌కు చేరుకునే ఎల్పీజీ దిగుమతులలో గణనీయమైన భాగం హోర్ముజ్ జలసంధి గుండా జరుగుతోంది. దీంతో యుద్దం ఇలాగే కొనసాగితే.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగితే సిలిండర్ ధరలు భారీగా పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. యుద్ద ప్రభావంతో మార్చి నుంచి గ్యాస్ ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తలు తగ్గడంతో గత నెలలో ధరలు కాస్త తగ్గాయి. దీంతో సామాన్యులు ఊరట చెందారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు ఎదురైతే సామాన్యులు ఇబ్బంది పడే అవకాశముంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టేందుకు సిద్దమవుతోంది.