Vaibhav-BCCI: వైభవ్‌కు అవకాశం ఇవ్వాల్సింది కాదు.. బీసీసీఐ తప్పు చేసింది.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

Wasim Jaffer Slams BCCI Over Vaibhav Sooryavanshi Debut: ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మీడియా హైప్‌కు లోనై వైభవ్‌కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే విషయంలో టీమిండియా మేనేజ్‌మెంట్ తొందరపడిందని అభిప్రాయపడ్డాడు. తొలుత ఓపెనర్‌గా ఆడిన సంజు శాంసన్‌ను పక్కనబెట్టి.. 15 ఏళ్ల వైభవ్‌కు అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు. జాఫర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. బుడ్డోడి అరంగేట్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో సంజు శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అయితే రెండో మ్యాచ్ నుంచి సంజు స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఆడాడు. వరుసగా మూడు మ్యాచ్‌లు ఆడిన బుడ్డోడు 14, 13, 15 పరుగులే చేసి నిరాశపరిచాడు. దీంతో చివరి టీ20లో మళ్లీ సంజును తుది జట్టులోకి తీసుకువచ్చి.. వైభవ్‌ను బెంచ్‌కు పరిమితం చేశారు. ఈ నిర్ణయాలపై స్పందించిన జాఫర్.. జట్టు ఎంపికలో స్థిరత్వం లేదని విమర్శించాడు. ‘వైభవ్‌ను జట్టులోకి తీసుకోవడంలో బీసీసీఐ చాలా తొందరపదిండి. అతడి గురించి మీడియాలో భారీగా ప్రచారం జరిగింది. అభిమానులు కూడా వెంటనే ఆడించాలని డిమాండ్ చేశారు. కానీ నా అభిప్రాయం ప్రకారం సంజునే కొనసాగించాల్సింది. వైభవ్ మరికొంత కాలం వేచి ఉండాల్సింది. జట్టుతో కలిసి ప్రయాణిస్తూ, సీనియర్ ఆటగాళ్లను గమనిస్తూ ఎంతో నేర్చుకునే అవకాశం అతడికి ఉండేది. వైభవ్ ఇంకా చాలా చిన్నవాడు. సరైన సమయం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకునేవాడు’ అని జాఫర్ పేర్కొన్నాడు.
టీమ్ మేనేజ్‌మెంట్ మీడియా హైప్ ప్రభావానికి లోనైందని కూడా వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ‘ఐపీఎల్ ప్రదర్శనతో వైభవ్ భరత్ జట్టులోకి వచ్చాడు. ఐర్లాండ్ సిరీసులో ఆడలేదు. వైభవ్ ఆడని ప్రతిసారి అతడి గురించి పెద్ద చర్చ జరిగింది. అందుకే వైభవ్‌ను త్వరగా జట్టులోకి తీసుకున్నట్లు అనిపించింది. ఒకవేళ సంజు పూర్తిగా ఫామ్ కోల్పోయి ఉంటే లేదా వరుసగా విఫలమై ఉంటే మార్పు సమంజసంగా ఉండేది. కానీ అలాంటి ఏమీ లేకుండానే వైభవ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌లోకి తీసుకురావడం తొందరపాటు నిర్ణయంగా అనిపించింది. ఈ విషయంలో బీసీసీఐ తప్పు చేసినట్లు నాకు అనిపిస్తోంది’ అని జాఫర్ చెప్పాడు.
జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కగా.. సంజు శాంసన్‌కు నిరాశ ఎదురైంది. దీనిపై కూడా జాఫర్ మాట్లాడుతూ.. ‘వైభవ్‌కు వరుసగా మూడు మ్యాచ్‌లు ఇచ్చి, తర్వాత సంజును తిరిగి తీసుకొచ్చారు. ఇప్పుడు జింబాబ్వే సిరీస్‌కు అతడిని పూర్తిగా పక్కన పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. భారత్ తరఫున అతడు ఒక్క టీ20 ఫార్మాట్‌లోనే ఆడుతున్నాడు. అలాంటి ఆటగాడికి క్రమం తప్పకుండా అవకాశాలు ఇవ్వాలి. రాబోయే టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో సంజు తప్పకుండా ఉండాలి. మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల సామర్థ్యం అతడికి ఉంది. అయితే ఇంగ్లండ్ సిరీస్‌లో అతడిని ఎలా ఉపయోగించారో, తర్వాత జింబాబ్వే పర్యటనకు ఎలా పక్కన పెట్టారో చూస్తే ఆశ్చర్యంగా ఉంది. జట్టు ఎంపికలో స్పష్టమైన వ్యూహం ఉండాలి’ అని బీసీసీఐకి జాఫర్ సూచించాడు.