July 12, 2026

కొట్లాడి మరీ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇప్పిస్తా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కొట్లాడి మరీ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇప్పిస్తా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Reading Time: 2 minutes

కొట్లాడి మరీ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇప్పిస్తా: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Caption of Image.

ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడుతున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు  తాను కొట్లాడి మరీ మంత్రి పదవి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో  రోడ్డు పనులకు శంకుస్థాపన  కార్యక్రమంలో  మాట్లాడిన ఆయన.. ఈసారి దేశంలో కచ్చితంగా జమిలి ఎన్నికలు వస్తాయని, అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తి ఐదున్నర సంవత్సరాలు అధికారంలో కొనసాగుతారని మంత్రి స్పష్టం చేశారు.

 రాబోయే నియోజకవర్గాల పునర్విభజనలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పెరుగుతాయని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 117 స్థానాలు గెలవడమే కాంగ్రెస్ టార్గెట్ అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్లు పాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పోయారని మండిపడ్డారు. లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా ఆలేరుకు కనీసం రెండు కాలువలు కూడా తీయలేదన్నారు. పైన కొండాపోచమ్మ, మల్లన్న సాగర్ లు నిండుకుండల్లా ఉన్నా ఆలేరుకు నీళ్లివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టకు కేసీఆర్ పదిసార్లు వచ్చినా కొండ మీద మాత్రమే చూశారని.. కొండ కింద అభివృద్ధిని గాలికొదిలేశారని, అందుకే ఆయనకు ప్రజల ఉసురు తగిలి ఓడిపోయారని ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం నిధుల కొరత ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం పైసా పైసా జమ చేస్తూ సంక్షేమ పథకాలను అందిస్తోందని మంత్రి వివరించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు, ఉచిత కరెంట్ వంటి హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించడంతో పాటు వారి స్కిల్స్ పెంచి ఉద్యోగాలు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని.. ఇందుకోసం 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి డబుల్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని.. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడే నితిన్ గడ్కరీతో మాట్లాడి వంగపల్లి అండర్ పాస్ పనులు మంజూరు చేయించానని గుర్తు చేశారు. బస్వాపురం, గందమళ్ళ రిజర్వాయిర్ పనులను పూర్తి చేసి ఆలేరును సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు. పదవుల కంటే ప్రజలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని.. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన వద్దకు రావచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.