Reading Time: 2 minutes
Yemen Airport Attack Iranian Plane Sanaa Airstrike Middle East Tensions

Yemen Airport Attack: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన వైమానిక దాడి కొత్త ఆందోళనలకు దారితీసింది. ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్‌వేస్ విమానం సనా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వేను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ఆరోపించారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో భయాందోళనలు నెలకొనగా, కొంతసేపు ఇతర విమానాల రాకపోకలను కూడా నిలిపివేశారు. హౌతీలకు అనుబంధంగా ఉన్న అల్-మసీరా టీవీ కథనం ప్రకారం.. దాడులు రన్‌వేలు, ల్యాండింగ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. పేలుళ్ల అనంతరం రన్‌వే నుంచి భారీగా పొగలు ఎగసిపడినట్లు స్థానికులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై సౌదీ అరేబియా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

ఇదిలా ఉండగా, సౌదీ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్ ప్రభుత్వం మాత్రం ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఆ విమానంలో సాధారణ ప్రయాణికులు కాకుండా హౌతీ ప్రతినిధి బృందం ప్రయాణిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని పేర్కొంది. ఇరాన్ విమానాన్ని సనాలో దించేందుకు ప్రయత్నించడం యెమెన్ సార్వభౌమాధికారానికి విరుద్ధమని ఆరోపిస్తూ, అందుకే రన్‌వేను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అనంతరం ఆ విమానం హోడెయిడా విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు తెలిపింది. యెమెన్ రక్షణ మంత్రి జనరల్ తాహెర్ అల్-అఖిలి ఈ ఘటనపై స్పందిస్తూ.. యెమెన్ గగనతలాన్ని ఉల్లంఘించే ఎలాంటి విమానాలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ అనుకూల హౌతీ నేతల బృందాన్ని అడ్డుకోవడానికే ఈ చర్య చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు హౌతీ ప్రతినిధి యహ్యా సరీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దీనికి తగిన ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. సౌదీ అరేబియా ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలను విరమించుకుని మళ్లీ ఘర్షణల దారిని ఎంచుకుందని ఆరోపించారు. హౌతీ సీనియర్ అధికారి హజెమ్ అల్-అస్సాద్ కూడా సౌదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి సంవత్సరాల్లో సౌదీ అరేబియా, హౌతీల మధ్య శాంతి చర్చలు సాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన పరిస్థితులను మళ్లీ ఉద్రిక్తం చేసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.