July 13, 2026

India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్‌పై భారత్‌ చారిత్రక విజయం

India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్‌పై భారత్‌ చారిత్రక విజయం
Reading Time: 2 minutes
India Women Crush England By 270 Runs In Historic Lords Test Yastika And Kranti Shine

India Women vs England Women: లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్‌ను 270 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టి ప్రతిభ కనబరిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని జట్టు మ్యాచ్ అంతటా ఆధిపత్యం చెలాయించింది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు సాధించగా, ఇంగ్లండ్‌ను 170 పరుగులకే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో యస్తికా భాటియా అద్భుత శతకం (113)తో పాటు స్మృతి మంధాన విలువైన 70 పరుగులు చేయడంతో భారత్ 341/7 వద్ద డిక్లేర్ చేసి, ఆతిథ్య జట్టుకు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రిచా ఘోష్ వేగవంతమైన అర్ధశతకంతో జట్టుకు మరింత బలం చేకూర్చింది. అయితే, లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు పూర్తిగా అదుపులో పెట్టారు. స్నేహ్ రాణా నాలుగు వికెట్లతో మెరవగా, క్రాంతి గౌర్, దీప్తి శర్మ, సయాలీ సత్ఘరే తలా రెండు వికెట్లు సాధించి ఇంగ్లండ్‌ను 186 పరుగులకే ఆలౌట్ చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన క్రాంతి గౌర్, యస్తికా భాటియా శతకంతో కలిసి లార్డ్స్ ఆనర్ బోర్డులో స్థానం సంపాదించడం ఈ విజయానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.

మొత్తంగా.. ఇంగ్లండ్‌ టూర్‌లో భారత పురుషుల జట్టు టీ-20 సిరీస్‌ కోల్పోయిన తర్వాత.. లార్డ్స్‌లో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత క్రీడాకారిణులు మ్యాచ్ మొత్తం ఆధిపత్యం ప్రదర్శించారు. ఒకవైపు, ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన టీ20 సిరీస్‌లో 0-4తో ఘోర పరాజయం పాలైన భారత పురుషుల క్రికెట్ జట్టు విమర్శలను ఎదుర్కొంది. గౌతమ్ గంభీర్ కోచింగ్ కింద జట్టు ప్రదర్శన నిరంతరం పరిశీలనలో ఉంది. మరోవైపు, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు, ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో జరిగిన తొలి మహిళల టెస్టులో ఇంగ్లాండ్‌ను 270 పరుగుల తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

‘క్రికెట్ పుట్టిల్లు’గా పిలువబడే లార్డ్స్‌లో, టీమ్ ఇండియా బలహీనంగా కనిపించిన ఇంగ్లండ్‌ను అన్ని విభాగాల్లోనూ అధిగమించి ఏకపక్షంగా ఓడించింది. యస్తిక భాటియా అద్భుతమైన శతకం మరియు భారత బౌలర్ల బలమైన ప్రదర్శనతో, టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించింది. ఈ విజయంలో వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ యస్తికా భాటియా కీలక పాత్ర పోషించింది. ఆమె అద్భుతమైన 113 పరుగులతో తన తొలి టెస్ట్ సెంచరీని సాధించి, లార్డ్స్ ఆనర్ బోర్డుపై తన పేరును లిఖించుకుంది. యస్తికా 145 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి, 14 ఫోర్లు కొట్టింది. రిచా ఘోష్ కూడా వేగంగా అజేయంగా 50 పరుగులు చేయగా, ఆ తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది (341/7d)..

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ 33.3 ఓవర్లలో 118 పరుగులకు ఐదు వికెట్లు తీసినప్పటికీ, ఆమె టెస్ట్ కెరీర్‌లో ఇది నాలుగో ఐదు వికెట్ల ప్రదర్శన. ఆమె ఈ మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది వికెట్లు తీసినప్పటికీ, ఆమె చేసిన ప్రయత్నాలు కూడా ఇంగ్లండ్‌ను ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌కు ఘోరమైన ఆరంభం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి లార్డ్స్ ఆనర్ బోర్డులో స్థానం సంపాదించుకున్న క్రాంతి గౌర్, రెండో ఇన్నింగ్స్‌లో కూడా విధ్వంసం సృష్టించింది. ఆమె తొలి ఓవర్‌లోనే టామీ బ్యూమాంట్‌ను డకౌట్ చేసింది. బ్యూమాంట్ అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే చివరి ఇన్నింగ్స్. ఆమె మైదానం వీడుతున్నప్పుడు భారత క్రీడాకారులు గౌరవ వందనం కూడా సమర్పించుకున్నారు.

ఆ తర్వాత క్రాంతి, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ హీథర్ నైట్‌ను అవుట్ చేసింది. ఈ టెస్ట్ తర్వాత రిటైర్ కావాలని నిర్ణయించుకున్న నైట్ కూడా, కేవలం 13 పరుగులు మాత్రమే చేసి తన వీడ్కోలు మ్యాచ్‌ను గుర్తుండిపోయేలా చేసుకోలేకపోయింది. స్నేహ్ రాణా (4 వికెట్లు)తో పాటు, క్రాంతి గౌర్, దీప్తి శర్మ, సయాలీ సత్ఘరే కూడా తలా 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ నడుము విరిచారు. అమీ జోన్స్ 54 పరుగులు చేసి కాసేపు ఇబ్బంది పడినా, ఆమె భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. సోఫీ ఎక్లెస్టోన్ (50) కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించింది. చివరికి, ఇంగ్లండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు భారత క్రీడాకారిణులు లార్డ్స్ ఆనర్ బోర్డుపై తమ పేర్లను లిఖించుకోవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్రాంతి గౌర్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించగా, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించి యస్తికా భాటియా ఆ జాబితాలో చేరింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. పురుషుల జట్టు నిరాశలో ఉండగా, మహిళల జట్టు సాధించిన ఈ విజయం భారత క్రికెట్‌కు పెద్ద ఊరటనిచ్చింది.