July 14, 2026

ఐపీఎల్ ట్రేడింగ్‌లో పెను సంచలనం.. సీఎస్కే యువ హిట్టర్‌పై కన్నేసిన ముంబై, గుజరాత్.. కట్‌చేస్తే..!

ఐపీఎల్ ట్రేడింగ్‌లో పెను సంచలనం.. సీఎస్కే యువ హిట్టర్‌పై కన్నేసిన ముంబై, గుజరాత్.. కట్‌చేస్తే..!
Reading Time: 2 minutes
ఐపీఎల్ ట్రేడింగ్‌లో పెను సంచలనం.. సీఎస్కే యువ హిట్టర్‌పై కన్నేసిన ముంబై, గుజరాత్.. కట్‌చేస్తే..!

Chennai Super Kings Transfers: ఐపీఎల్ 2027 సీజన్ ట్రేడింగ్ విండో అప్పుడే హీటెక్కింది. గత కొన్ని సీజన్లుగా ప్లేఆఫ్స్ చేరలేక సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాబోయే సీజన్ కోసం పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తోంది. అయితే, ఇదే సమయంలో సిఎస్‌కే ఊహించని సరికొత్త సవాలును ఎదుర్కొంటోంది. జట్టులోని ఓ యువ సంచలన ఆటగాడిని ఎలాగైనా దక్కించుకోవాలని రెండు దిగ్గజ జట్లు గట్టిగా పట్టుబడుతుండటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఉర్విల్ పటేల్ కోసం ముంబై, గుజరాత్ పోటీ..!

ఐపీఎల్ 2026 సీజన్‌లో తన మురుపు లాంటి బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్‌ను ట్రేడింగ్ ద్వారా సొంతం చేసుకోవడానికి ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా, సాయి కిషోర్ వంటి స్టార్ ఆటగాళ్లను సిఎస్‌కేలోకి తీసుకురావాలని చెన్నై మేనేజ్‌మెంట్ భావిస్తున్న తరుణంలో.. ఈ రెండు జట్లు దానికి బదులుగా ఉర్విల్ పటేల్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ముంబై ఇండియన్స్ మైండ్ గేమ్..

హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ విషయంలో ముంబై ఇండియన్స్ తొలుత చెన్నై నుంచి శివమ్ దూబేతో పాటు యువ సంచలనం ఆయుష్ మాత్రేను ఆశించింది. కానీ భవిష్యత్తు స్టార్‌గా భావిస్తున్న ఆయుష్‌ను వదులుకోవడానికి సిఎస్‌కే ఏమాత్రం అంగీకరించలేదు. దీంతో ముంబై తన వ్యూహాన్ని మార్చింది. ఆయుష్ స్థానంలో శివమ్ దూబేతో పాటు ఉర్విల్ పటేల్‌ను కూడా తమకు ఇవ్వాలని కొత్త ప్రతిపాదనను సిఎస్‌కే ముందు ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.

గుజరాత్ టైటాన్స్ పట్టుదల..

మరోవైపు గుజరాత్ టైటాన్స్ సైతం తమ స్పిన్నర్ సాయి కిషోర్‌ను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అందుకు బదులుగా ఉర్విల్ పటేల్ కావాల్సిందేనని పట్టుబడుతోంది. వాస్తవానికి మిడిలార్డర్‌ను బలోపేతం చేసుకోవడానికి సర్ఫరాజ్ ఖాన్‌ను వదులుకునేందుకు చెన్నై సుముఖత వ్యక్తం చేసినా, గుజరాత్ మాత్రం ఉర్విల్ వైపే మొగ్గు చూపుతోంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రస్తుతం తీవ్ర సందిగ్ధంలో పడింది. ముంబైకి శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్‌లను పంపి, గుజరాత్‌కు ఉర్విల్‌ను ఇచ్చే అంశంపై అంతర్గతంగా సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.

రికార్డుల వేటగాడు ఉర్విల్ పటేల్..

గత సీజన్‌లో ఉర్విల్ పటేల్ కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లోనే 205.21 భీకర స్ట్రైక్ రేట్‌తో 197 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్‌పై కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ బాది అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఆ మ్యాచ్‌లో 23 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 65 పరుగులు రాబట్టాడు. అంతేకాదు, ఇన్నింగ్స్ ఆరంభంలో ఎదుర్కొన్న మొదటి 8 బంతుల్లోనే 6 సిక్సర్లు బాది ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు లిఖించాడు. ఇంతటి విధ్వంసకర ఆటగాడిని వదులుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని సీఎస్‌కే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయుష్ మాత్రేను తుది జట్టులోకి వస్తే ఉర్విల్‌కు ఓపెనింగ్‌లో చోటు దక్కడం కష్టమే కాబట్టి, ట్రేడింగ్‌కు మొగ్గు చూపే అవకాశాలు కూడా లేకపోలేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..