షాబాద్ ఘటన: అందుకే వాళ్లను చంపేశా.. ఆరు హత్యలకు ముందు నిందితుడి సెల్ఫీ వీడియో !

షాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆరు హత్యలకు పాల్పడిన పోక్సో నిందితుడు రాజ్ కుమార్ కేసులో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. హత్యలు చేసే కొన్ని గంటల ముందు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో నిందితుడు తాను చేయబోయే హత్యలకు, తన ఆత్మహత్యకు కారణాలను చెబుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్, అప్పుల బాధతో జీవితంపై విరక్తి చెందానని వీడియోలో నిందితుడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
తాను అమ్మాయిని నమ్ముకొని చాలా మోసపోయానని, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వీడియో రికార్డ్ చేసుకున్నాడని.. అతని మొబైల్లోని వీడియోను పోలీసులు మీడియాకు చూపించారు. 2 నిమిషాల 26 సెకన్లు వీడియో ఉందని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషీ తెలిపారు. తాను అమ్మాయిని నమ్ముకొని చాలా మోసపోయానని, ఆ కుటుంబం తనను అన్ని విధాలా వాడుకుందని.. తనపై కేసు పెట్టి తనను మోసం చేశారని, అందుకే వాళ్లని చంపాలనుకున్నానని నిందితుడు వీడియోలో చెప్పినట్లు సమాచారం. చివరకి తన పిల్లలకి కూడా భూమి లేకుండా పోయిందని నిందితుడు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియోలో చెప్పాడు.
►ALSO READ | వాడు ఇంత ప్రశాంతంగా చావడమేంటి సర్..? షాబాద్ ఆరు హత్యల నిందితుడి అన్న కామెంట్స్
డబ్బు మొత్తం ఇచ్చేసి అప్పుల పాలయ్యానని, జీవితం మీద విరక్తి కలిగిందని అని వీడియో రికార్డ్ చేసిన రాజ్ కుమార్ శుక్రవారం రాత్రి దైవాలగూడకు వెళ్లి వీడియోలో చెప్పినట్టే బాలిక కుటుంబాన్ని చంపేశాడు. అతని భార్యా, పిల్లలను కూడా హతమార్చాడు. ఆరు హత్యలు చేసి మూడు రోజులు తప్పించుకుని తిరిగి సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజెర్ల గ్రామ శివారులోని శతాబ్ది వెంచర్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.