
హైదరాబాద్: గచ్చిబౌలిలో ఒరిగిన నాలుగంతస్తుల బిల్డింగ్ కూల్చివేత మొదలైంది. ఈ కూల్చివేతతో గచ్చిబౌలి డివిజన్ గోపనపల్లి ఎన్టీఆర్ నగర్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బాహుబలి మిషన్ (క్రేన్)తో వంగిన భవనాన్ని నేలమట్టం చేస్తున్నారు.
అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. నిన్న (శుక్రవారం) ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరగకుండా చుట్టుపక్కల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.
ఇదిలా ఉండగా.. సీఎంసీ పరిధిలో శుక్రవారం 13 అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించి నేలమట్టం చేశారు. మరో ఇద్దరు యజమానులకు నోటీసులు జారీ చేశారు. అలాగే, ఎంఎంసీలోని మాన్సురాబాద్, నాగోల్, హయత్ నగర్, నాచారం ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలను తొలగించారు. గాజులరామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. కుత్బుల్లాపూర్మండలం గాజులరామారంలోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేశారు.
ALSO READ : జూబ్లీహిల్స్‌లో ఫ్లోర్ క్లీనింగ్‌కు తాగునీళ్లు.. రూ.20 వేల ఫైన్ వేసిన జలమండలి
గ్రామంలోని సర్వే నంబర్లు 329/1, 342లలో కబ్జాదారులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, పెద్ద సంఖ్యలో నిర్మాణాలు చేపట్టి, వాటిని పేదలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాయిబాబా, సాబేర, అబీద్, బురుగ రాజన్న బస్తీలలో ఆక్రమణలపై ఆఫీసర్లకు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్, ఆర్ఐ కలీమ్పర్యవేక్షణలో 25 ఇండ్లు, 10 బేస్మెంట్లను కూల్చివేశారు.