Reading Time: 2 minutes
Iran Media Slams Asim Munir Us Bias Trump Ceasefire Talks

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఇప్పటికే ఇస్లామాబాద్ వేదికగా రెండు దేశాల మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగాయి. కానీ చర్చలు విఫలం కావడంతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. అనంతరం మరోసారి చర్చల కోసం ఇరాన్‌ను ఒప్పించేందుకు నేరుగా పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ టెహ్రాన్‌కు వెళ్లారు. ఇరాన్ పెద్దలతో సమావేశం అయ్యారు. అనంతరం మునీర్‌కు ముసాయిదా ప్రతిపాదనను అందించారు. దాన్ని అమెరికాకు అందించాలని సూచించారు. కానీ ముసాయిదాను అందించడంలో అసిమ్ మునీర్ విఫలమైనట్లుగా ఇరాన్ మీడియా ఆరోపించింది. అసిమ్ మునీర్ పూర్తిగా అమెరికాకు భజనపరుడిలా మారిపోయారని ధ్వజమెత్తింది.

ఇది కూడా చదవండి: PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి

అమెరికాతో జరుగుతున్న చర్చల్లో పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఆరోపించింది. రెండు దేశాల మధ్య తటస్థంగా ఉండాల్సిన పాకిస్థాన్.. అమెరికాకు తొత్తుగా మారిందని మండిపడింది. అసిమ్ మునీర్ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇరాన్ ప్రతిపాదనను అమెరికాకు తెలియజేసే బాధ్యతను మునీర్ తీసుకున్నారని.. కానీ ఇప్పటివరకు వాషింగ్టన్ నుంచి స్పష్టమైన, కచ్చితమైన సమాధానం రాలేదని టెహ్రాన్ పేర్కొంది. మొత్తం మధ్యవర్తిత్వం అమెరికాకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని.. తద్వారా ఇరాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేయవచ్చని ఇరాన్ భావిస్తోంది.

ఇది కూడా చదవండి: Trump: చర్చలకు ఇరాన్ నిరాకరణ.. చేసేదేమీలేక కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. అంతర్జాతీయంగా తీవ్ర చర్చ

ఇరాన్ టీవీ కథనం ప్రకారం… అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన సందర్భంగా ఇరాన్ ముసాయిదా ప్రతిపాదనను అందుకున్నారు. అయితే ఆ ప్రతిపాదనను అమెరికా పక్షానికి సరిగ్గా సమర్పించడంలో గానీ.. అమెరికా స్పందనను స్పష్టం చేయడంలో గానీ విఫలమయ్యారని ఆరోపించింది. మునీర్ వ్యక్తిగతంగా ఇరాన్‌తో సంబంధాలు కలిగి ఉండి కూడా.. బహిరంగంగా, దౌత్యపరంగా అమెరికా ప్రయోజనాలకు మద్దతు ఇస్తున్నారని ధ్వజమెత్తింది. మధ్యవర్తి సరిగ్గా నిలబడకపోతే.. మొత్తం ప్రక్రియ విఫలమవుతుందని ఇరాన్ హెచ్చరించింది.

ఇదిలా ఉండగా ఇరాన్-అమెరికా మధ్య దాదాపు 40 రోజుల పాటు యుద్ధం జరిగింది. అనంతరం రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ గడువు బుధవారంతో ముగుస్తోంది. ఆశ్చర్యంగా ఇరాన్ అడగకుండానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ నిరవధికంగా పెంచారు. హార్ముజ్ జలసంధిపై మాత్రం దిగ్బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. పాకిస్థాన్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించినట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. తమ విజ్ఞప్తి మేరకు పొడిగించినందుకు ట్రంప్‌నకు పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ధన్యవాదాలు తెలిపారు.