Reading Time: 2 minutes
Ipl 2026 Ms Dhoni Likely Return For Mi Vs Csk Clash Will Jacks Boost For Mumbai Indians

MS Dhoni Likely Return for MI vs CSK Clash in IPL 2026: ఐపీఎల్‌ 2026లో భాగంగా వాంఖడేలో హై వోల్టేజ్ పోరుకు రంగం సిద్దమైంది. గురువారం ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు టీమ్స్ దిగువన ఉండడంతో.. ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. గెలిచిన టీమ్ ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. ఓడిన జట్టుకు మాత్రం ఆశలు సన్నగిల్లుతాయి. ఈ నేపథ్యంలో ఎంఐ, సీఎస్‌కేలు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ముంబైతో కీలక పోరుకు ముందు చెన్నైకి ఓ గుడ్ న్యూస్. మాజీ కెప్టెన్, టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీ మైదానంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

మోకాలి గాయంతో బాధపడుతున్న ఎంఎస్ ధోనీ జట్టుతో పాటే ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్ కోసం భాగ్యనగరం కూడా వచ్చాడు. ఉప్పల్ స్టేడియంలో ఆడుతాడనుకున్నా.. అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో మహీ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. సుమారు అరగంట పాటు వికెట్ కీపింగ్ చేశాడు. మరో అరగంట పాటు బ్యాటింగ్ కూడా చేశాడు. ప్రీ సీజన్‌లో కాల్ఫ్ స్ట్రెయిన్‌తో ఇబ్బంది పడిన ధోనీ.. ఇప్పుడు పూర్తి ఫిట్‌గా కనిపిస్తున్నాడు. అతడు బ్యాటింగ్ చేస్తూ ఎలాంటి ఇబ్బంది లేకుండా బంతులను సులభంగా బౌండరీకి పంపడం అభిమానులకు ఊరటనిచ్చింది. ముంబైపై ధోనీ బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. మహీ ఆడడంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సీఎస్‌కే పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండటంతో.. ధోనీ రీఎంట్రీ జట్టుకు భారీ బలాన్నిస్తుంది.

సీఎస్‌కే జట్టులోకి ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్ చేరాడు. గాయపడిన నాథన్ ఎల్లిస్ స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు వాంఖడేలో జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. ఇటీవల గాయంతో ఖలీల్ అహ్మద్ కూడా దూరమవడంతో.. జాన్సన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సీఎస్‌కేకు గాయాల సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి. ఇటీవల మ్యాచ్‌లో యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే హామ్‌స్ట్రింగ్ గాయంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో జట్టులో మార్పులు తప్పనిసరి అయ్యాయి.

ముంబై ఇండియన్స్‌కు కూడా ఓ గుడ్ న్యూస్. ఇంగ్లండ్ స్టార్ విల్ జాక్స్ ఎట్టకేలకు జట్టుతో చేరాడు. ఐపీఎల్ 2026 ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన జాక్స్.. తాజాగా వాంఖడేలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ.. గంటకు పైగా బ్యాటింగ్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ను చూపించాడు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన జాక్స్.. ముంబై జట్టుకు కీలక బలం కానున్నాడు. అతడి చేరికతో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు మరింత బలపడనున్నాయి. జాక్స్ జట్టులోకి రావడంతో విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్‌లో మార్పులు రావొచ్చు. అల్లా ఘజన్‌ఫర్ లేదా మిచెల్ సాంట్నర్‌లో ఒకరు చోటు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మిడిల్ ఆర్డర్‌లో జాక్స్ ఫినిషర్‌గా కూడా కీలక పాత్ర పోషించగలడు.