Reading Time: 2 minutes
Ss Thaman Musical Journey Boys To Og Milestones Struggles

S.S.Thaman: తెలుగు చిత్ర పరిశ్రమలో నేడు సంగీత దర్శకుడు తమన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజుల్లో ఆయన ఒక సినిమాకు సంగీతం అందిస్తున్నారంటే.. అది కచ్చితంగా మ్యూజికల్ హిట్ అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడుతుంది. అయితే, ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి దాదాపు మూడు దశాబ్దాల పాటు కఠిన శ్రమను, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తాజాగా ఇచ్చిన ఎన్టీవీకి ఇచ్చిన పాడ్‌కాస్ట్‌లో తన కెరీర్ మొదలైన నాటి నుంచి నేటి వరకు సాగిన ప్రయాణాన్ని తమన్ ఆసక్తికరంగా వివరించారు.

READ ALSO: Telangana Budget 2026-27: రూ. 3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంతంటే?

13 ఏళ్లకే మొదలైన ప్రస్థానం
తమన్ సినీ ప్రయాణం 1997లో ఒక ఎలక్ట్రానిక్ డ్రమ్మర్‌గా ప్రారంభమైంది. చాలా చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడంతో, కుటుంబ భారం మొత్తం ఆయన భుజాన పడింది. కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే వృత్తిపరంగా అడుగులు వేయడం మొదలుపెట్టారు. దాదాపు 9,000 స్టేజ్ షోలు, 900 సినిమాలకు ప్రోగ్రామర్‌గా పనిచేసిన అపార అనుభవం ఆయనను నేడు ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్‌గా తీర్చిదిద్దింది. తమన్ కెరీర్‌లో ‘బాయ్స్’ సినిమా ఒక మైలురాయి. కేవలం నటుడిగానే కాకుండా, ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు శంకర్ చేసిన సాయం గురించి తమన్ ప్రత్యేకంగా చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను మా కుటుంబానికి ఏకైక ఆధారమని తెలిసిన శంకర్ సార్, షూటింగ్ జరిగిన ఏడాది పాటు మా కుటుంబానికి కావలసిన అన్ని ఆర్థిక అవసరాలను ఆయనే చూసుకున్నారు. నేను మ్యూజిక్ మీద ఫోకస్ పెట్టడానికి ఆ సాయం ఎంతో ఉపయోగపడింది” అని గుర్తుచేసుకున్నారు. ఆ ఏడాది కాలంలో కేవలం నటన మాత్రమే కాకుండా, ఒక పాటను ఎలా రూపొందించాలి, సినిమా మేకింగ్ అంటే ఏమిటి, అనే విషయాలను శంకర్ దగ్గర నేర్చుకున్నానని, అది తనకు ఒక ‘ఫిల్మ్ కాలేజీ’ లాంటిదని పేర్కొన్నారు.

మణిశర్మ శిష్యరికంలో..
సంగీత దర్శకుడు మణిశర్మ వద్ద తమన్ చాలా కాలం ప్రోగ్రామర్‌గా పనిచేశారు. మణిశర్మను ఒక గురువులా, యోగిలా ఆరాధిస్తానని తమన్ చెప్పుకోచ్చారు. “మణిశర్మ గారు చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు. ఆయన పని విధానం, క్రమశిక్షణ నన్ను రాటుదేల్చాయి. ఆయన స్టూడియోలో ఉన్నప్పుడు ఒక తపస్సులా సంగీతాన్ని ఆస్వాదించేవారు. ఆ వాతావరణమే నాకు మ్యూజిక్ కంపోజిషన్ మీద పట్టు సాధించేలా చేసింది” అని తమన్ తన గురువు పట్ల గౌరవాన్ని చాటుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో తన మ్యూజిక్‌పై ‘కేవలం డ్రమ్స్, శబ్దం ఎక్కువగా ఉంటుంది’ అనే విమర్శలు ఉండేవి. అయితే, ‘మహానుభావుడు’, ‘భాగమతి’ చిత్రాల సమయం నుంచి పూర్తిగా తన శైలిని మార్చుకున్నట్లు చెప్పారు. ఆ చిత్రాల తర్వాత సంగీతంలో ఒక రకమైన పరిణతి వచ్చిందని చెప్పుకొచ్చారు. కేవలం కమర్షియల్ హంగులే కాకుండా, కథలోని భావోద్వేగానికి ప్రాధాన్యతనిస్తూ, గ్లోబల్ మ్యూజిక్ ట్రెండ్స్‌ను మన ప్రాంతీయ సంగీతానికి జోడించి కొత్త సౌండింగ్‌ను తీసుకువచ్చినట్లు వివరించారు.

READ ALSO: S.S.Thaman: ‘తమన్’ పేరు వెనుక అసలు కథ ఇదే..