Reading Time: < 1 minute

జన జీవనంలోకి రండి… మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన పిలుపు మేరకు తిరిగి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుత, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన సూచించారు. గత రెండేళ్ల కాలంలో తెలంగాణ పోలీసుల నిరంతర కృషి ఫలితంగా వివిధ స్థాయిలకు చెందిన 588 మంది తెలంగాణ, చత్తీస్‌గఢ్  రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు లొంగిపోయారని తెలిపారు. 

వీరందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకం కింద లభించే అన్ని రకాల ప్రయోజనాలను అందజేశామని వెల్లడించారు. ప్రస్తుతం వీరంతా తమ సొంత గ్రామాల్లో కుటుంబాలతో కలిసి సంతోషంగా జీవిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాలపై నమ్మకం, అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న అజ్ఞాత మావోయిస్టులు సైతం ఇక్కడి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారని డీజీపీ స్పష్టం చేశారు. 

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మిగిలిన 15 మంది మావోయిస్టు నాయకులు, క్యాడర్‌  ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున తక్షణ సహాయం అందజేయడంతో పాటు, వారు సమాజంలో ఆత్మగౌరవంతో బతికేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాంతియుత మార్గాల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.

©️ VIL Media Pvt Ltd.