Reading Time: < 1 minute

బడ్జెట్ వేళ గ్యాస్ రేట్ల షాక్: ఫిబ్రవరి 1న పెరిగిన కమర్షియల్ సిలిండర్ల రేట్లు..

Caption of Image.

కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెడుతున్న రోజే దేశవ్యాప్తంగా గ్యాస్ రేట్ల షాక్ తగిలింది. ముఖ్యంగా వ్యాపార వర్గాలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరల పెంపు ఫిబ్రవరి 1 ఆదివారం నుండే అమల్లోకి వచ్చాయి.

19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను తాజాగా రూ.49 మేర పెంచారు. గమనించాల్సిన విషయమేమిటంటే.. గత నెల జనవరి 1న కూడా ఆయిల్ కంపెనీలు రూ.111 మేర పెంచాయి. అంటే కొత్త ఏడాది ప్రారంభం నుంచి వరుసగా రెండో నెల కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,691.50 నుండి రూ.1,740.50కి చేరింది. ఏప్రిల్ 2025 నుంచి దాదాపు ఆరుసార్లు ధరలు తగ్గించి ఊరటనిచ్చిన కంపెనీలు.. కొత్త ఏడాదిలో తిరిగి ధరల బాదుడు ప్రారంభించాయి.

హైదరాబాద్‌లో కూడా కమర్షియల్ సిలిండర్ ధర పెరుగుదల ప్రభావం కనిపిస్తోంది. తాజా పెంపుతో హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర దాదాపు రూ.1,950 మార్కును తాకింది. అయితే సామాన్య గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ సిలిండర్ల రేట్ల విషయంలో మాత్రం ఆయిల్ కంపెనీలు ఊరటనిచ్చాయి. దీంతో ఇళ్లలో వాడే 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు చేయలేదు. హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా రూ.905గా కొనసాగుతోంది.

వరుసగా పెరుగుతూపోతున్న కమర్షియల్ గ్యాస్ ధరలు.. హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ రంగంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. వంట గ్యాస్ ధరలు పెరగడం వల్ల బయటి ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గుల ఆధారంగానే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి. ఫిబ్రవరి 1న ఒకవైపు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఉండగా.. మరోవైపు ఈ ధరల పెరుగుదల వినియోగదారులకు మింగుడుపడటం లేదు. 

©️ VIL Media Pvt Ltd.