Reading Time: < 1 minute
Megastar Chiranjeevi Financial Aid Makeup Artist Manager Surgery

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. అవసరమైన చోట అండగా నిలబడటం, కష్టంలో ఉన్నవారికి చేయూత ఇవ్వడం… ప్రతి మనిషి జీవితంలో వెలుగులు నింపాలని ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నారు చిరంజీవి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లతో వేలాది మందికి ప్రాణం పోసిన ఆయన, కరోనా సమయంలోనూ, విపత్తుల సమయంలోనూ అండగా నిలిచారు. ప్రజలకు ప్రేమని పంచడమే తన బాధ్యతగా ముందుకు సాగుతున్న మెగాస్టార్, మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. హార్ట్ ఆపరేషన్ కోసం మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ (శివ) కు 10.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు మెగాస్టార్. అంతేకాకుండా, అపోలో ఆసుపత్రికి వ్యక్తిగతంగా వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుని, పూర్తి చికిత్స అందేలా చూసుకున్నారు.
అదే సమయంలో, తన మాజీ మేనేజర్ కె.వి. నరసయ్య కుటుంబానికి కూడా అండగా నిలిచారు మెగాస్టార్.

నరసయ్య భార్యకు అవసరమైన బైపాస్ శస్త్రచికిత్స కోసం 9.5 లక్షల రూపాయలు అందించి, ఆ కుటుంబానికి అత్యవసర సమయంలో ఆపద్బాంధవుడయ్యారు. సినీ సంఘాల సభ్యులు సహాయం కోసం మెగాస్టార్‌ను సంప్రదించగా, ఆయన వెంటనే పూర్తి బాధ్యత తీసుకుంటూ అన్నీ తానే చూసుకుంటానని చెప్పారు. ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, వైద్య బిల్లులపై రాయితీని ఇప్పించడానికి చిరంజీవి స్వయంగా ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు. ఫైనల్ బిల్లును కూడా స్వయంగా చెల్లించారు చిరు. ఇటీవల గద్దర్ అవార్డ్స్‌లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో పొందిన ₹10 లక్షలను పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేశారు మెగాస్టార్. మరో 5 లక్షలను తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు విరాళంగా అందించారు. తన సేవలతో ఎంతోమంది జీవితాలలో వెలుగుల్ని నింపుతున్న మెగాస్టార్ రియల్ హీరో. ఆయన సేవలు ఇలానే కొనసాగాలని, మెగాస్టార్ మార్గం మరెంతో మందికి స్ఫూర్తిగా మారాలని కోరుకుందాం.