Reading Time: 1 minute
Andhra Pradesh: ఏపీలో మరో ఎయిర్‌పోర్ట్.. త్వరలోనే పనులు ప్రారంభం.. ఎక్కడంటే..?

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. త్వరలోనే పనులు కూడా మొదలుకానున్నాయి. నెల్లూరు జిల్లాలో దగదర్తి ఎయిర్‌పోర్ట్‌ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. దాదాపు 1332 ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మించనుండగా.. దీనిని పోర్టులు, నేషనల్ హైవేలు, పారిశ్రామిక జోన్లకు అనుసంధానించనున్నారు. దీని వల్ల నెల్లూరు జిల్లా, చుట్టుపక్కల ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ది చెందనున్నాయి. లాజిస్టిక్స్, టూరిజం, దాని అనుబంధ రంగాలు మరింతగా అభివృద్ది చెందనున్నాయి. దీంతో ఈ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే జిల్లా దశదిశలు మారిపోతాయని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఈ ఇంటర్నేషనల్ విమానాశ్రయం పనులు చేపడతామని అన్నారు.

దశలవారీగా నిర్మాణం

ఈ ఎయిర్‌పోర్ట్ పనులను దశలవారీగా చేపట్టనున్నారు. తొలి విడతలో 1.4 లక్షల మంది ప్రయాణికులకు వార్షిక సామర్థ్యంతో తీర్చిదిద్దనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అనంతరం 15 మిలియన్ల వరకు పెంచేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక ప్యూచర్‌లో కార్గో ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ఎయిర్‌పోర్ట్ కోసం భూసేకరణ, విద్యుత్, నీరు, టెలిఫోన్ కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో 54 కోట్లు విడుదల చేసింది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా పనులు చేపట్టేందుకు అధికారులు రెడీ అవుతున్నారు .జూన్ లేదా జులైలో దగదర్తి ఎయిర్‌పోర్ట్ పనులకు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రకటించారు.

జులైలో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం

ఇక జులైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తి అవ్వగా.. కొన్ని పెండింగ్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి కాగా.. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి విమానం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. దీంతో ట్రయల్ రన్ సక్సెస్ అయిందని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఇక భోగాపురంతో పాటు దగదర్తి విమానాశ్రయం పూర్తి అయితే రాష్ట్రంలో 8వ ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. కాగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు కనెక్టివిటీ కోసం విశాఖ నుంచి ప్రత్యేక రోడ్లు నిర్మించారు. అలాగే చుట్టపక్కల ప్రాంతాల నుంచి కూడా కనెక్టివిటీ కోసం కొత్త రోడ్లు నిర్మించారు. దీని వల్ల ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణికులు త్వరగా చేరుకోవచ్చు.