కృత్రిమ చక్కెర vs సహజ చక్కెర: చాలామంది షుగర్ పేషెంట్లు పండ్లను మానేసి, తెలియకుండానే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. వాస్తవానికి మనం తాగే కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్‌లో ఉండే కృత్రిమ చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అత్యంత వేగంగా పెంచుతుంది. దీనితో పోలిస్తే పండ్లలో ఉండే ఫ్రక్టోజ్, ఇతర పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే అతిగా తింటే అమృతం కూడా విషమే కాబట్టి, పరిమితి ముఖ్యం.
పండ్లు తినేటప్పుడు చేయకూడని పొరపాట్లు: మనం చేసే అతిపెద్ద పొరపాటు పండ్లను రసం రూపంలో తీసుకోవడం. పండ్లను రసం రూపంలో తీసుకోవడం వల్ల వాటిలోని పీచుపదార్థం పూర్తిగా నశిస్తుంది. దీనివల్ల చక్కెర నేరుగా రక్తంలో కలిసి స్థాయిలను పెంచుతుంది. కాబట్టి పండ్లను ముక్కలుగా కోసుకుని నమిలి తినడమే ఉత్తమం. సాధ్యమైనంత వరకు పండ్లను తొక్కతో సహా తినాలి. పీచుపదార్థం శరీరంలో చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది.
టైమింగ్ చాలా ముఖ్యం: చాలామంది భోజనం ముగిసిన వెంటనే డెజర్ట్ లాగా పండ్లు తింటారు. ఇది అత్యంత ప్రమాదకరం. భోజనంలోని పిండి పదార్థాలు, పండ్లలోని చక్కెర కలిసి ఒకేసారి ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపుతాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో లేదా సాయంత్రం 4 గంటల సమయంలో అంటే.. రెండు భోజనాల మధ్యలో మిడ్ డే స్నాక్ గా పండ్లు తీసుకోవడం ఉత్తమం.
క్వాంటిటీ ఎంత ఉండాలి?: మధుమేహులు పండ్లు తినవచ్చు అంటే కిలోల కొద్దీ అని కాదు. ఒక సగటు షుగర్ పేషెంట్ రోజుకు 100 నుండి 150 గ్రాముల పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. ఇది తియ్యగా ఉన్నప్పటికీ, రోజుకు కేవలం రెండు లేదా మూడు ముక్కలు మాత్రమే తీసుకోవాలి. ఇక మామిడి పండు తినేటప్పుడు దాంతో పాటు కొన్ని బాదం పప్పులు లేదా వాల్నట్స్ తినండి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటాయి.
వేసవి పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి భయపడి పండ్లను దూరం పెట్టకుండా.. పైన చెప్పిన విధంగా సమయం, పరిమాణం మరియు పీచు పదార్థం విషయంలో జాగ్రత్త పడితే మీ వేసవి తియ్యగా సాగిపోతుంది.




