Reading Time: < 1 minute
Hyderabad: కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి

ఖరీదైన కార్లతో మితిమీరిన వేగంతో హైదరాబాద్‌ నగర రోడ్లపై ప్రమాదకర డ్రైవింగ్ చేస్తూ అమాయకుల మరణాలకు కారణం అవుతన్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఇలాంటి ఘటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సోమవారం తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతంలో గోస శ్యామ్ రాజ్ అనే 32 ఏళ్ల యువకుడు కేబుల్‌ బ్రిడ్జిపై నిలబడి ఉండగా జూబ్లీ హిల్స్ నుంచి ఐకియా వైపు వస్తున్న వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ మెర్సడెస్ బెంజ్ కారు అతన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్యామ్‌ను స్థానికులు సమీపంలోని ఓ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శ్యామ్ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ప్రమాదాన్ని గమనించగా యాక్సిడెంట్‌ జరిగిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్టు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారు పశ్చిమ బెంగాల్ రిజిస్ట్రేషన్‌తో ఉన్నట్టు గుర్తించారు. ఆ కారును స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు పోలీసులు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.