Reading Time: 2 minutes
Weather Alert: అబ్బ.. ఎండలు, వానలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటి వేళ ఎండలు దంచికొడుతున్నాయి.. సాయంత్రం వేళ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎండల తీవ్రత పెరగడంతోపాటు.. వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ నుండి రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న నిన్నటి ద్రోణి/గాలుల అంతరాయం ప్రస్తుతం, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌పై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తెలంగాణ, అంతర కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. దీంతోపాటు.. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశగ గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమ – అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడి, తేమ – అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ :-

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు. రాయలసీమలో రాగల 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాదారణము కంటే 2-4డిగ్రీలు పెరిగే అవకాశముంది.. ఆ తదుపరి గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం, బుధవారం, గురువారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్ద మార్పు ఏమి లేదు..

ఈరోజు,రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, గంటకు 30- 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు పశ్చిమ, తూర్పు జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..