Banana: అరటిపండు ప్రకృతి మనకు అందించిన ఒక అద్భుతమైన ఆహారం. ప్రతి ఇంట్లోనూ, ప్రతి వయసు వారు ఇష్టంగా తినే పండు ఇది. ఇందులో ఉండే విటమిన్ B6, విటమిన్ C, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మన శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంతటి పోషక విలువలున్న ఈ పండు, రసాయనాలతో పండినదైతే మాత్రం ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది.
రంగు చూసి మోసపోకండి: మార్కెట్లో కనిపించే తళతళలాడే పసుపు రంగులో అందంగా కనిపించే అరటిపండ్లన్నీ సహజంగా పండినవి కావు. పండ్లను త్వరగా పండించి, ఎక్కువ లాభాలు గడించడం కోసం వ్యాపారులు ‘కాల్షియం కార్బైడ్’ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, లోపల మాత్రం విషతుల్యమై ఉంటాయి.
రసాయనాలతో పండించిన పండ్లను గుర్తించే మార్గాలు: భారత ఆహార భద్రత, ప్రమాణాల అధికారం (FSSAI) ప్రకారం, రసాయనాలతో పండించిన పండ్లను మనం సులభంగా గుర్తించవచ్చు.రంగులో తేడా: పండు మొత్తం ముదురు పసుపు రంగులో ఉండి, దాని చివరలు (కాడ,అడుగు భాగం) మాత్రం పచ్చగా ఉంటే, అది ఖచ్చితంగా రసాయనాలతో పండించినదే అని గుర్తించాలి. మచ్చలు లేకపోవడం: సహజంగా పండిన అరటిపండుపై అక్కడక్కడా చిన్న చిన్న నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. కానీ కెమికల్స్ వాడిన పండ్లు మచ్చలు లేకుండా చాలా శుభ్రంగా, పసుపు రంగులో మెరిసిపోతుంటాయి.
కాడ భాగం: పండు సహజంగా పక్వానికి వచ్చినప్పుడు దాని కాడ నలుపు రంగులోకి మారుతుంది. రసాయనాలు వాడితే అది పచ్చగా లేదా లేత పసుపు రంగులోనే ఉంటుంది. రుచి మరియు ఆకృతి: రసాయనాలతో పండిన పండు పైన మెత్తగా ఉన్నా, లోపల కొన్నిసార్లు గట్టిగా ఉంటుంది. అంతేకాకుండా, దీని రుచి కూడా అంత తియ్యగా ఉండదు.
ఆరోగ్యానికి కలిగే నష్టాలు: కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలు వాడిన పండ్లను తినడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో ఇవి శ్వాసకోస సంబంధిత ఇబ్బందులకు, గొంతు సమస్యలకు దారితీయవచ్చు. అందుకే FSSAI మన దేశంలో కాల్షియం కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. దీనికి బదులుగా కేవలం అనుమతించిన స్థాయిలో ‘ఇథిలిన్ గ్యాస్’ను మాత్రమే వాడాలని సూచిస్తోంది. అరటిపండును కొనేటప్పుడు కేవలం దాని అందం, రంగును మాత్రమే చూడకండి. సహజంగా పండిన అరటిపండ్లనే ఎంచుకోండి. పండ్లను తినే ముందు కనీసం 10-15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత శుభ్రంగా కడిగి తినడం వల్ల వాటిపై ఉండే రసాయన అవశేషాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.




