
తమిళ రాజకీయాల్లో ‘దళపతి’ విజయ్ ఎంట్రీ ఒక సంచలనం. వెండితెరపై అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన ఆయన, రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెట్టగానే అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో నాయకులు ప్రజల మధ్య ఉండాలి, కానీ విజయ్ మాత్రం ఇప్పుడు ప్రజా క్షేత్రం కంటే న్యాయస్థానాల చుట్టూనే ఎక్కువగా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వృత్తిపరమైన వివాదాలు, వ్యక్తిగత కలతలు, రాజకీయ ఆరోపణలు.. ఇలా అన్ని వైపుల నుండి కేసులు ఆయన్ను చుట్టుముట్టాయి.
వ్యక్తిగత జీవితంలో తుపాను
విజయ్ రాజకీయాల్లోకి రాకముందే ఆయన వ్యక్తిగత జీవితంపై రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే, అవి కేవలం గాసిప్స్ మాత్రమే కావని, ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడంతో స్పష్టమైంది. భరణం కింద ఆమె రూ. 300 కోట్లు డిమాండ్ చేస్తుండగా, విజయ్ మాత్రం రూ. 30 కోట్లు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. నటి త్రిషతో ఉన్న సాన్నిహిత్యంపై వస్తున్న ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత రాజేశాయి. ప్రస్తుతం ఈ కేసు జూన్ 15కి వాయిదా పడింది, ఇది విజయ్ ఇమేజ్‌పై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఎన్నికల అఫిడవిట్ వివాదం
రాజకీయంగా విజయ్‌కు ఎదురైన అతిపెద్ద షాక్.. ఎన్నికల అఫిడవిట్. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఆయన, ఒక అఫిడవిట్‌లో రూ. 115 కోట్లు, మరొకటిలో రూ. 220 కోట్లు అని పేర్కొనడం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై మద్రాస్ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆదాయపు పన్ను శాఖ (IT), ఎన్నికల కమిషన్ (EC) స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఒకవేళ ఆస్తుల వివరాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారని నిరూపితమైతే, ఆయన అభ్యర్థిత్వంపై వేటు పడే ప్రమాదం ఉంది.
కరూర్ విషాదం
విజయ్ రాజకీయ యాత్రలో ‘కరూర్ తొక్కిసలాట’ ఘటన ఒక మాయని మచ్చగా మారింది. 60 మంది ప్రాణాలు బలిగొన్న ఈ ఘటనపై ప్రస్తుతం సీబీఐ విచారణ సాగుతోంది. దీనితో పాటు, ఆయన నటించిన ‘జననాయగన్’ సినిమా లీక్ వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్లా లేదా రాజకీయ కుట్రనా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి.
“బయట మెరుపులు.. లోపల కలతలు” అన్నట్టుగా ఉంది విజయ్ ప్రస్తుత పరిస్థితి. సినిమా ఇమేజ్‌తో ఓట్లు రాల్చవచ్చు కానీ, కోర్టు కేసులు, నైతికపరమైన ఆరోపణలను ఎదుర్కోవడం కత్తిమీద సామే. ఈ కేసుల వలయం నుండి విజయ్ బయటపడి రాజకీయంగా రాణిస్తారా? లేక చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కుని వెనకబడిపోతారా? అన్నది తమిళనాడు ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..