
ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA) ఆధ్వర్యంలో ముప్పై కోట్ల బడ్జెట్‌తో పది సినిమాల్ని నిర్మించనున్నారు. ఈ మేరకు టీఎఫ్‌డీఏ సోమవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చదలవాడ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, ట్రెజరర్ సాయి రాజేష్, వైస్ ప్రెసిడెంట్ సముద్ర, ప్రముఖ దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ తదితరలు హాజరై ప్రసంగించారు.
Also Read :Bellamkonda Ganesh : డార్లింగ్ డైరెక్టర్ + జాతి రత్నాలు రైటర్.. బెల్లంకొండ గణేష్ కొత్త సినిమా షురూ!
ఈ కార్యక్రమంలో వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ ‘మా కమిటీ కొత్తగా ఎన్నికైంది. మేం విద్య, వైద్యం, ఉపాధి అనే అంశాల మీదే ఫోకస్ పెట్టాం. చదలవాడ శ్రీనివాసరావు ఉగాది నాడు ఓ గొప్ప ఆలోచనను మాతో పంచుకున్నారు. నిర్మాతలుంటేనే మా దర్శకులు మనుగడ కొనసాగించగలరు. టాలెంట్ ఉండి కూడా యూనియన్ మెంబర్ షిప్ కోసం కష్టపడాల్సి వస్తుంది. చదలవాడ శ్రీనివాసరావు వారి బ్యానర్ మీద ముప్పై కోట్లతో పది సినిమాల్ని నిర్మిస్తున్నారు. మా అసోసియేషన్‌లోని మెంబర్లకు ఆయన గొప్ప అవకాశం ఇస్తున్నారు. దీని ద్వారా పది మంది దర్శకుల కంటే.. వంద, నూట యాభై మంది అసిస్టెంట్ దర్శకులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ సినిమాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో సీనియర్ దర్శకులు అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తారు. మా డైరెక్టర్ అసోసియేషన్‌లోని మెంబర్లు చెప్పిన కథలు, బౌండెడ్ స్క్రిప్టుల్ని ఫిల్టర్ చేస్తున్నాం. ఈ మేరకు కమిటీ ఆల్రెడీ పని చేస్తోంది. ఒకరికి ఒక అవకాశం ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. కానీ చదలవాడ శ్రీనివాసరావు ఒకేసారి ఎంతో మందికి అవకాశం ఇస్తున్నారు. ఆ సినిమాల్లో లాభాలు వస్తే.. యూనియన్‌కే ఇస్తాను అని ఆయన అన్నారు. ఇది మాకు అవకాశం కాదు.. వరం.. ఆయనకు శతసహస్ర కృతజ్ఞతాభివందనాలు’ అని అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘మీడియా నాకు ఎన్నో ఏళ్ల నుంచి సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇలా పబ్లిసిటీ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. కానీ వీఎన్ ఆదిత్య మాత్రం నా చేతుల మీదుగానే ఈ ప్రకటన జరగాలని అన్నారు. సినిమా ఇండస్ట్రీలో డబ్బు సంపాదించలేకపోయినా.. కళామతల్లికి చేసిన సేవతో నాకు సంపూర్ణ ఆరోగ్యం, సంతోషం కలుగుతుంది. ఏఎన్నార్ గారు, శోభన్ బాబు గార్ల దగ్గరి నుంచి నేను ఎంతో మందితో ఎన్నో సినిమాలు తీశాను. నాకు అజయ్ అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్. ఆయన నాకు ‘జీవిత ఖైదు’ 75 లక్షల్లో తీసి పెట్టారు. అప్పట్లో నాకు ఏడు కోట్ల షేర్ వచ్చింది. నేను అప్పట్లో ప్రతీ సినిమాని 30 నుంచి 40 రోజుల్లో తీశాను. నాకు ఇప్పుడున్న ఇండస్ట్రీ కన్నా అప్పుడున్న ఇండస్ట్రీ అంటేనే ఇష్టం. శోభన్ బాబు గారు, ఏఎన్నార్ గారు లాంటి హీరోలు మాకెంతో సపోర్ట్ చేస్తుండేవారు. ఇప్పుడు సినిమా పరిశ్రమలో అన్నీ పెరిగాయి.. థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకి కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మంచి విలువలు, మంచి కథలు, కమర్షియ్ అంశాలుండే గొప్ప సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నాను. క్వాలిటీ సినిమాలు తీయాలి.. క్రమశిక్షణతో కచ్చితంగా ఉదయం ఏడు గంటలకు షాట్ తీయాలి. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే చాలు’ అని అన్నారు.