Reading Time: 2 minutes
IPL 2026: ఫ్లేఆఫ్స్ చేరే తొలి జట్టు ఇదే.. ఇంటికెళ్లే టీం ఏదో తెలిస్తే ఫ్యాన్స్ హర్ట్ అవ్వాల్సిందే..?

IPL 2026 Points Table: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. నిన్న రాత్రి లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక పోరులో పంజాబ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. పంజాబ్ ప్లే ఆఫ్ దిశగా అడుగులు వేస్తుండగా, ఇతర జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారింది.

పంజాబ్ కింగ్స్ అప్రతిహత విజయం..

ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు పూర్తికాగా, పంజాబ్ కింగ్స్ అత్యంత నిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు అందుకున్న పంజాబ్, ఒక మ్యాచ్ రద్దు కావడంతో లభించిన పాయింట్‌తో కలిపి మొత్తం 11 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జట్టు మరో మూడు విజయాలు సాధిస్తే అధికారికంగా ప్లే ఆఫ్ చేరుకున్న మొదటి జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది.

టాప్ 4 లో నిలిచిన జట్లు..

పాయింట్ల పట్టికలో పంజాబ్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ చెరో 8 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండు జట్లు ఆరు మ్యాచ్‌లలో నాలుగింటిని గెలుచుకున్నాయి. ఇక తెలుగు అభిమానుల ఆశాకిరణం సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కనీసం ఐదు విజయాలు సాధించాల్సి ఉంటుంది.

డేంజర్ జోన్‌లో దిగ్గజ జట్లు..

చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ప్రస్తుతం ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉండి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ జట్లు నాకౌట్ దశకు వెళ్లాలంటే మిగిలిన ఎనిమిది మ్యాచ్‌లలో కనీసం ఆరు గెలవాలి. ఏమాత్రం తడబడినా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ నిన్నటి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచి తమ ఖాతాను తెరిచినప్పటికీ పట్టికలో తొమ్మిదో స్థానంలోనే ఉంది.

ముంబై ఇండియన్స్ పరిస్థితి ఏమిటి?

ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయాన్ని మాత్రమే నమోదు చేసి రెండు పాయింట్లతో పట్టికలో చివరన ఉంది. ముంబై ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే రాబోయే తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడింటిని తప్పక గెలవాలి. పాయింట్ల పట్టికలోని ఈ తీవ్రమైన పోటీ క్రికెట్ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Ipl 2026 Points Table

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..