Reading Time: 2 minutes
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది: భద్రతా బలగాలు అప్రమత్తం.. టూరిస్ట్ ప్రదేశాల్లో భద్రత పెంపు

దేశ చరిత్రలో చీకటి రోజుగా చెప్పుకునే పహల్గామ్ ఉగ్ర కాల్పులు జరిగి ఏప్రిల్ 22తో ఏడాది కావోస్తుంది. రేపటితో ఏడాది అవుతున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాశ్మీర్ లోయలోని పర్యాటక ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏవైనా విధ్వంసకర ఘటనలు జరిగే అవకాశం ఉన్న క్రమంలో అన్ని టూరిస్ట్ ప్రదేశాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులు ఈ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే భద్రతా ఏర్పాట్లపై పలు కీలక సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఈ చర్యలు చేపట్టారు. సున్నితమైన పర్యాటక ప్రదేశాల చుట్టూ భద్రతను పెంచాలని అధికారులు ఆదేశించారు.

దశలవారీగా ప్రారంభం

గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లోని బైసారన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 25 మంది పర్యాటకులతో పాటు గుర్రపు స్వారీ చేసే స్ధానిక వ్యక్తి మరణించారు. ఈ ఘటన తర్వాత జమ్మూకశ్మీర్‌లో 50 పర్యాటక ప్రదేశాలను అధికారులు మూసివేయగా.. పర్యాటక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే పరిస్థితి చక్కబట్టాక దశలవారీగా వీటిని తిరిగి తెరిచారు. అయితే పహల్గామ్‌లోని బైసారన్ లోయను మాత్రం ఇప్పటికే తెరవలేదు. అయితే పహల్గామ్ దాడి తర్వాత అధికారులు ప్రతీఒక్కరినీ క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. టూరిజం సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించేందుకు క్యూఆర్ బేస్డ్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. దీని ద్వారా బయట నుంచి వచ్చే గుర్రపుస్వారీ నిర్వాహకులు, వీధి వ్యాపారులు, దుకాణదారులను సలువుగా గుర్తు పట్టవచ్చు. పోలీసులు ప్రతీఒక్క వ్యక్తి వివరాలు తెలుసుకుని క్యూఆర్ అందిస్తారు.

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే..

పర్యాటకులు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు అన్నీ తెలుస్తాయి. వ్యక్తి పేరు, తల్లిదండ్రుల వివరాలు, అడ్రస్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పని చేసే ప్రాంతం, పోలీస్ వెరిఫికేషన్ వంటి వివరాలు తెలుసుకోవచ్చు. అయతే పహల్గామ్‌కు వచ్చే పర్యాటకులు ఉగ్రవాదుల దాడిలో మరణించిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే పహల్గామ్‌లోని మిగతా ప్రాంతాలకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. ఉగ్రదాడి తర్వాత అక్కడ నివసించే చాలామంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పుడిప్పుడే టూరిజం రంగం అక్కడ మళ్లీ పుంజుకుంది. దేశ, విదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. దీంతో మరోసారి ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.