
ఏపీలోని పాడి రైతులకు కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు వంటి పశువులను పెంచుకునేవారికి రూ.3 లక్షల వరకు రుణం అందించనుంది. అయితే ఈ రుణానికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. ఈ మేరకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనుంది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా అర్హతను బట్టి రూ.3 లక్షల వరకు పాడి రైతులు లోన్ పొందవచ్చు. సొంత భూమి ఉన్నవారు, కౌలు రైతులు, డ్వాక్రా సంఘాల్లోని పాడి రైతులు ఈ రుణం సౌకర్యం పొందచ్చు. పశువుల సంఖ్యను బట్టి రుణ పరిమితిని నిర్ణయిస్తారు. ఎక్కువ పశువులు ఉంటే ఎక్కువ లోన్ పొందవచ్చు.
లోన్ ఎలా పొందాలంటే..?
మీ సమీపంలోని బ్యాంక్‌కు వెళ్లి పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ పూర్తి చేయాలి. ఆధార్, పట్టాదారు పాస్ బుక్, పశువుల వివరాలు, పాస్ పోర్ట్ సైజు ఫొటో, పశువైద్యాధికారి సర్టిఫికేట్ అందించాలి. లోన్ తీసుకునేందుకు ఎలాంటి పూచీకత్తు, హామీ అవసరం లేదు. వడ్డీ 7 శాతంగా ఉంటుంది. ఏడాదిలోపు రుణం చెల్లిస్తే మూడు శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. అంటే మీరు 4 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుందన్నమాట. ఈ డబ్బులును పశు పోషణ, పశుగ్రాసం, ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. అతి తక్కువ వడ్డీకే లోన్ పొందే సౌకర్యం ఉండటంతో దీనిని పాడి రైతులు ఉపయోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు. పశుపోషణ మీద ఆధారపడి జీవించే రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం ఈ రుణ సదుపాయం అందిస్తోంది. పశువులు కొనుగోలు చేయాలన్నా, వాటి పెంపకానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. దీంతో పాడి రైతులకు తోడ్పాటు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పశువుల హాస్టళ్లు
ఏపీ సీఎం చంద్రబాబుకు కీలక ప్రకటన చేశారు. పశువులకు హాస్టళ్లను నిర్మిస్తామని తెలిపారు. జిల్లాలకు ఐదు కేంద్రాల చొప్పున ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల కేంద్రాల సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వీటిని ఏర్పాటు చేయనుండగా.. వీటి ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ శాఖ అందించనుంది. ఇక గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు జరగనుండగా.. పశుసంవర్ధకశాఖ పశువుల వైద్య సేవల బాధ్యతలను తీసుకోనుంది. ఇక స్వయం సహాయక సంఘాలు వీటి నిర్వహణను చూసుకోనున్నాయి. ఒక్కో హాస్టల్‌లో 25 పెద్ద పశువులకు నివాసం కల్పిస్తారు. ఒక్కొ హాస్టల్ నిర్మాణానికి రూ.10 లక్షలు అవసరం పడతాయి. అరకరం వీటి కోసం కేటాయించనున్నారు. ఇక అన్ని జిల్లాల్లో 2027 మార్చి 31 నాటికి పశువులకు హాస్టళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.