సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాపానికి చల్లని పుచ్చకాయ తినాలని చాలా మంది అనుకుంటారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో దొరికే పుచ్చకాయలు ఎంతవరకు సురక్షితమైనవి? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. వాటి రంగును, తీపిని పెంచడానికి రసాయనాలు కలుపుతున్నారన్న వార్తలు జనాల్లో భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో కొనేముందు ఏది కల్తీ, ఏది సహజమైన పుచ్చకాయ అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
కల్తీ పుచ్చకాయను గుర్తించడం ఎలా?: పుచ్చకాయ ఎర్రగా కనిపించడానికి తరచుగా ఎరిత్రోసిన్ లేదా రెడ్-బి అనే రసాయన రంగును ఉపయోగిస్తారు. కాబట్టి మీరు కొన్న పుచ్చకాయలో రంగులు వాడారా లేదా అన్నది తెలుసుకునేందుకు కాయను రెండు ముక్కలుగా కోయండి. ఒక చిన్న తెల్లటి పత్తి ముక్కను తీసుకుని, ఎర్రగా ఉన్న గుజ్జుపై మెల్లగా రుద్దండి. పత్తి తెల్లగానే ఉంటే అది సహజంగా పండిన పండు అని ఆర్థం. ఒకవేళ పత్తి ఎర్రగా మారితే, దానికి కృత్రిమ రంగులు అద్దారని అర్థం. ఇలాంటి పండ్లను తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం.
కల్తీ పండు తినడం వల్ల కలిగే నష్టాలు: రసాయనాలు కలిపిన పుచ్చకాయలు తినడం వల్ల కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు రావచ్చు. అలాగే వాంతులు, విరేచనాలు. గొంతు మంట లేదా ఇన్ఫెక్షన్ వంటి తీవ్ర సమస్యలకు దారి తీయవచ్చు. మీరు దాన్ని గుర్తించకుండా దీర్ఘకాలికంగా అలానే తింటే ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి కల్తీ పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి.
మంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి: మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు ఈ నాలుగు విషయాలను గమనించండి. పుచ్చకాయ దాని పరిమాణం కంటే ఎక్కువ బరువుగా అనిపించాలి. అప్పుడే అది జ్యుసీగా ఉందని అర్థం. పండుపై వేళ్లతో తట్టినప్పుడు లోపల ఖాళీగా ఉన్నట్లు డబ్ డబ్ అనే లోతైన శబ్దం రావాలి.
పండు నేలకు తగిలి ఉండే చోట క్రీమ్ కలర్ లేదా లేత ఆరెంజ్ రంగులో మచ్చ ఉండాలి. ఒకవేళ ఆ మచ్చ తెల్లగా లేదా పచ్చగా ఉంటే, అది ఇంకా సరిగ్గా పండలేదని అర్థం. అలానే పుచ్చకాయ సమానంగా, ఎగుడుదిగుడులు లేకుండా ఉండాలి. వింతగా ఉబ్బి ఉన్న పండ్లను తీసుకోకపోవడమే మంచిది. కొంచెం జాగ్రత్త వహిస్తే, మీరు ఆరోగ్యకరమైన రుచికరమైన పుచ్చకాయను కొనవచ్చు.




