Reading Time: 2 minutes
బాకీ తీర్చలేదని బంధాన్ని తుంచేశాడు.. పుట్టబోయే బిడ్డతో సహా ముగ్గురి ప్రాణాలను చిదిమేశాడు!

హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి.. అన్నను, గర్భిణీ అని కూడా చూడకుండా వదినను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పురాలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

అదిల్ ఖాన్, అఖిల్ ఖాన్ లు సొంత అన్నదమ్ములు. వీరిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారు. గతంలో అఖిల్ ఖాన్ తన తమ్ముడైన అదిల్ ఖాన్ వద్ద అవసరాల నిమిత్తం కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే, గడువు ముగిసినా ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో గత నాలుగు నెలలుగా వీరి మధ్య తీవ్రమైన మనస్పర్థలు నెలకొన్నాయి. తమ్ముడికి ముఖం చాటేస్తూ అఖిల్ తప్పించు తిరుగుతుండటంతో అదిల్ ఖాన్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

సోమవారం (ఏప్రిల్ 20) సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో, ముందస్తు ప్రణాళికతో కత్తిని వెంటబెట్టుకుని అదిల్ ఖాన్ సుల్తాన్‌పురాలోని తన అన్న ఇంటికి వెళ్లాడు. అక్కడ డబ్బు విషయంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. ఆవేశం కట్టలు తెంచుకోవడంతో, అదిల్ ఖాన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో అన్న అఖిల్ ఖాన్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ దాడిని అడ్డుకోవడానికి అఖిల్ ఖాన్ భార్య అజ్మీరా బేగం ప్రయత్నించారు. ఆమె నాలుగు నెలల గర్భిణీ అన్న కనీస మానవత్వం కూడా లేకుండా అదిల్ ఖాన్ ఆమెపై కూడా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన దంపతులిద్దరూ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న మీర్ చౌక్ ఏసీపీ శ్యామ్ సుందర్, ఇన్‌స్పెక్టర్ కొండలరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ మాజీద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.”క్లూస్ టీమ్ ద్వారా అన్ని ఆధారాలను సేకరించాం. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాం. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తాము” అని శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ తెలిపారు. రక్తసంబంధం కంటే కాసుల విలువే ఎక్కువనుకుని, పుట్టబోయే బిడ్డను సైతం పొట్టనబెట్టుకున్న ఈ ఉదంతం పాతబస్తీలో విషాద ఛాయలు నింపింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..