Reading Time: < 1 minute
వేసవి తాపానికి విరుగుడు ఈ పండు షర్బత్.. తయారీ సింపుల్‌, బెనిఫిట్స్‌ తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు!

వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి నీరసం రావడం సాధారణం. దాహం వేయగానే చాలామంది కృత్రిమ చక్కెరలు ఉండే కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. అయితే, ఇవి తాత్కాలికంగా దాహం తీర్చినప్పటికీ ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే ప్రకృతి ప్రసాదించిన పండ్ల రసాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో మారేడు పండు అద్భుతమైన ఆరోగ్య నిధిగా పరిగణిస్తారు. మండుతున్న ఎండల్లో శరీరాన్ని చల్లబరచడానికి సాఫ్ట్ డ్రింక్స్ కంటే మన సాంప్రదాయ మారేడు పండు (Bael) షర్బత్ ఎంతో మేలైనది. ఈ పానీయం రుచితో పాటు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.

మారేడు పండులో ఉండే ఫైబర్ మలబద్ధకం, అజీర్తిని తొలగిస్తుంది. కడుపులో మంట, అసిడిటీ సమస్యలను తగ్గించి జీర్ణకోశాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. వేసవిలో బయట తిరిగే వారికి వడదెబ్బ తగలకుండా ఇది కాపాడుతుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతూ సహజమైన శక్తిని (Instant energy) అందిస్తుంది. ఇందులో ఉండే విటమిన్-సి శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తుంది.

తయారీ విధానం: ముందుగా బాగా పండిన మారేడు పండును పగలగొట్టి లోపలి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ గుజ్జును నీటిలో వేసి బాగా పిసికి, అందులో ఉండే పీచు, గింజలను వడకట్టి తొలగించాలి. ఇప్పుడు ఆ రసంలో మీ రుచికి తగినట్లుగా చక్కెర లేదా బెల్లం కలపండి బెల్లం వాడటం ఆరోగ్యానికి మరింత మంచిది. రుచి కోసం చిటికెడు మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి కలిపి ఐస్ ముక్కలతో సర్వ్ చేయండి.

మారేడు షర్బత్ తయారీలో ఎప్పుడూ పండిన పండునే వాడాలి, పచ్చి పండు జీర్ణక్రియకు భారంగా ఉంటుంది. అలాగే ఈ షర్బత్‌ను నిల్వ ఉంచకుండా తాజాగా తయారు చేసుకుని తాగడం వల్ల పూర్తి పోషకాలు లభిస్తాయి. చక్కెర కంటే బెల్లం వాడటం వల్ల ఆరోగ్యానికి అధిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ వేసవిలో ఆర్టిఫిషియల్ డ్రింక్స్ మానేసి, ప్రకృతి ప్రసాదించిన ఈ అమృతాన్ని సేవించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..