
పసుపులేటి కన్నంబ.. దక్షిణాదిన తిరుగులేని తెలుగు తారగా పేరుపొందారు ఆమె. నేటి తరానికి కూడా ఆమె జీవితం, సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు ఆదర్శప్రాయం. 1912లో ఏలూరులో జన్మించి, గుంటూరులో పెరిగిన కన్నంబ పెద్ద కుటుంబం నుండి వచ్చారు. కుటుంబంలో ఆమె ఒక్కతే కూతురు, మిగతా 17 మంది తోబుట్టువులు మగపిల్లలే. అల్లారుముద్దుగా పెరిగిన కన్నంబ ఐదో తరగతి వరకు చదువుకున్నారు. వీధి నాటకాల పట్ల ఆసక్తితో 11 ఏళ్ల వయసు నుంచే నాటకాల్లో నటించడం ప్రారంభించారు. నావెల్ నాటక సమాజంలో చేరి బాలతారగా పలు చిత్రాలు చేశారు. ఆమె 1934లో సీతా కళ్యాణం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి, 1935లో హరిశ్చంద్ర చిత్రంలో చంద్రమతి పాత్రతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమలోకి వెళ్లేందుకు మొదట తల్లిదండ్రులు వెనుకాడినప్పటికీ, ఎవరికీ లొంగను, మీరు తలదించుకునే పని చేయను అనే ఆమె మాటలకు అనుమతిచ్చారు.
మూగ అమ్మాయిని సినిమాల్లోకి తీసుకురావడం పిచ్చితనం అన్నారు.. అందం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు
ఆ తర్వాత కన్నంబ వందకు పైగా చిత్రాల్లో నటించి విజయం సాధించారు. ద్రౌపదీ వస్త్రాపహరణం, కనకతార, పల్నాటి యుద్ధం, అనార్కలి, దక్షయజ్ఞం, తోడికోడళ్లు వంటి చిత్రాలతో ఆమె ప్రముఖ నటిగా ఎదిగారు. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, ఎస్.వి. రంగారావు, చిత్తూరు వి. నాగయ్య వంటి దిగ్గజాలతో కలిసి నటించి, తన నటనా ప్రతిభ, సంభాషణ పటిమతో అగ్ర తారగా నిలిచారు. అయితే, ఆమె కెరీర్ సవాళ్లతో కూడుకున్నది. అప్పటి ఓ ప్రముఖ తమిళ నటుడు కన్నంబను లొంగదీసుకోవాలని ప్రయత్నించాడు. ఆమె తన తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అతనిని ఎదిరించారు. దీని ఫలితంగా ఆమెకు అవకాశాలు తగ్గడం ప్రారంభమయ్యాయి. ఇదే తరహాలో ఇప్పుడు కథానాయికలు ఎదుర్కొంటున్న కాస్టింగ్ కౌచ్ వంటి చేదు అనుభవాలను కన్నంబ అప్పట్లోనే ఎదుర్కొన్నారు. ఆ నటుడి ఆగడాలు కన్నంబ భర్త, సినీ నిర్మాత, దర్శకుడు కడారు నాగభూషణాన్ని కూడా వెంటాడాయి. వీరిద్దరూ వివాహం చేసుకున్న తర్వాత శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీని స్థాపించి సుమతి, పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం వంటి తెలుగు, తమిళ చిత్రాలను నిర్మించారు.
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే.. అవమానాలు ఎదుర్కొందన్న దర్శకుడు
కన్నంబ, నాగభూషణం తమ మంచి మనసుతో అడిగిన వారికి సహాయం చేసి, షూరిటీలు ఇచ్చి అనేక నష్టాలను చవిచూశారు. అవకాశాలు కోల్పోయేలా చేసిన ఆ నటుడితోనే ఒప్పందం కుదుర్చుకొని రెండు చిత్రాలను నిర్మించే క్రమంలో మరింత నష్టపోయారు. మొదటి సినిమాను ఆ నటుడు తన స్నేహితుడి బ్యానర్‌కు ఇవ్వమని అడిగితే ఇచ్చేశారు, కానీ కేవలం 30 శాతం మాత్రమే చెల్లించి మిగతా మొత్తం ఇవ్వలేదు. అయినా సరే, కన్నంబ దంపతులు అతనితో రెండో సినిమా తీయడానికి సిద్ధపడగా, అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ నటుడు రాజకీయాల వైపు మొగ్గు చూపడంతో చిత్రం పూర్తి కాక ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. ఆత్మబలం (1964) ఆమె చివరి చిత్రం. అదే ఏడాది మే 7న ఎలాంటి అనారోగ్యం లేకుండా ప్రశాంతంగా కన్నుమూశారు. కానీ, ఆమె మరణం తర్వాత కూడా ఆ నటుడి పగ తీరలేదని కన్నంబ మనవడు పసుపులేటి దేవీ చౌదరి తెలిపారు. కన్నంబ భౌతికకాయాన్ని ఖననం చేసిన తర్వాత, సమాధి కట్టించాలని కుటుంబ సభ్యులు అనుకునే లోపే శవం మాయమైంది. నగలు దొంగలించేందుకు దొంగలు ఈ పని చేశారని కొందరు భావించగా, అది ఆ నటుడి పనేనని మనవడు దేవీ చౌదరి ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినప్పటికీ, కన్నంబ శవం ఏమైందో ఇప్పటికీ తెలియదు.