Reading Time: 2 minutes
భార్యపై అనుమానం.. కవల కుమార్తెల గొంతు కోసి హత్య చేసిన కసాయి తండ్రి!

కాన్పూర్, ఏప్రిల్ 20: బీహార్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ వ్యాపారి శశి రంజన్ మిశ్రా (48)కు పశ్చిమ బెంగాల్‌కు చెందిన రేష్మా (40)తో 2014లో వివాహం జరిగింది. వివాహానికి ముందు రేష్మా కాన్పూర్‌లోని ఒక బ్యూటీ పార్లర్‌లో పనిచేసేది. ఈ దంపతులకు ఇద్దరు కవల కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు రిద్ధి, సిద్ధి (11). అలాగే ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వీరు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కిద్వాయ్ నగర్ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు కమార్తెలు ఐదో తరగతి చదువుతున్నారు. అయితే శశి రంజన్ మిశ్రాకు భార్యపై అనుమానం ఉంది. ఆమెకు అక్రమసంబంధం ఉందని భావించి తరచూ గొడవపడేవాడు. కుడుకుతో ఆమె వేరుగా ఉండాలని, కవల కూతుర్లను తాను పెంచుతానని తరచూ చెప్పేవాడు. తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్న శశి.. భార్య చర్యలను తమనించడానికి తన ఫ్లాట్‌లో సీసీటీవీ కెమెరాలను సైతం పెట్టాడు.

ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం తర్వాత శశి తన కుమార్తెలను నిద్రపుచ్చాడు. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో కూతుళ్లలో ఒకరిని వాష్‌ రూంలోకి తీసుకెళ్లి, మళ్లీ తీసుకువచ్చి నిద్రపుచ్చి లైట్లు ఆర్పివేశాడు. ఇది జరిగిన 2 గంటల తర్వాత అంటే తెల్లవారుజామున 4.30 గంటలకు పోలీసులకు ఫోన్‌ చేసి ‘నేను నా పిల్లలను చంపేశాను. దయచేసి రండి’ అని తెలిపాడు. ఫ్లాట్‌కు పోలీసులు వచ్చేసరికి తలుపుకు తాళం వేసి ఉంది. కాలింగ్‌ బెల్‌ కొట్టడంతో అతని భార్య రేష్మా క్షేత్రి తలుపు తెరిచింది. తన భర్త ఫోన్ చేశాడని తెలుసుకున్న ఆమె అతని గదికి పరుగెత్తుకెళ్లి చూసింది. నేలపై తన కూతుళ్లు చనిపోయి ఉండటం చూసి కుప్పకూలిపోయింది. వారి పక్కనే మిశ్రా కూర్చుని ఉన్నాడు. సంఘటన సమయంలో వీరి ఆరేళ్ల కుమారుడు మరో గదిలో తల్లితో కలిసి నిద్రపోతున్నాడు.

హత్యలను చేసింది తానేనని శశి అంగీకరించాడు. లోపలికి వెళ్లి చూడగా గదిలో రక్తం మడుగులో ఇద్దరు కుమార్తెలు పడి ఉండటం చూసి షాకయ్యారు. వెంటనే నిందితుడు శశిని అరెస్టు చేసి, కేసుపై దర్యాప్తు చేపట్టినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర నాథ్ చౌదరి మీడియాకు తెలిపారు. రేష్మా ఫిర్యాదు మేరకు నౌబస్తా పోలీస్ స్టేషన్‌లో మిశ్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. సంఘటనా స్థలం నుంచి ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ తెలిపారు. డీసీపీ సౌత్ దీపేంద్ర నాథ్ చౌదరి తెలిపారు. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆర్థిక సమస్యల వల్ల ఈ హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. నిందితుడు తన భార్యపై అనుమానంతో భవనం ప్రవేశ ద్వారం నుంచి పడకగది వరకు సీసీటీవీ కెమెరాలను అమర్చినట్లు కూడా వెల్లడైంది. తన కూతుళ్లను చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు నిందితుడు విచారణలో తెలిపాడు. కానీ వారిని చంపిన తర్వాత తీవ్ర భయాందోళనకు గురై, తన పథకాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయినట్లు వెల్లడించాడు.

హత్యకు ఒక రోజు ముందు తాను కకాడియో ప్రాంతం నుంచి ఒక కత్తిని కొనుగోలు చేసినట్లు చెప్పాడు. మొదట పిల్లల ఆహారంలో నిద్రమాత్రలు కలిపి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారిద్దరినీ గొంతు నులిమి చంపి, ఆపై వారి గొంతులు కోసినట్లు హత్యలు చేసిన విధానాన్ని పోలీసుల ఎదుట చెప్పాడు. ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించగా, జాగింగ్ శునకాల బృందాన్ని కూడా పిలిపించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష తరలించారు. హత్య సమయంలో అదే ఇంట్లో ఉన్న తల్లికి నేరం గురించి ఎలా తెలియకుండా పోయిందో? అనే విషయంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.